దిశా మృతి కేసు దర్యాప్తు.. ఎవరీ సీమా పాహుజా? | Disha Salian Probe Seema Pahuja to Lead CBI Investigation | Sakshi
Sakshi News home page

దిశా మృతి కేసు దర్యాప్తు.. ఎవరీ సీమా పాహుజా?

Sep 16 2026 11:41 AM | Updated on Sep 16 2026 11:51 AM

Disha Salian Probe Seema Pahuja to Lead CBI Investigation

న్యూఢిల్లీ: దివంగత నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా సాలియన్‌ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పలు క్రిమినల్‌ కేసుల దర్యాప్తులో అనుభవం ఉన్న సీబీఐ అధికారి సీమా పాహుజాకు ఈ కేసు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. 2020 జూన్‌ 8న ముంబైలోని మలాడ్‌ ప్రాంతంలో ఓ భవనంలోని 12వ అంతస్తు నుంచి పడిపోవడంతో దిశా సాలియన్‌ మృతి చెందింది.  ఇది జరిగిన ఆరేళ్ల తర్వాత ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేపట్టింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్‌లో ఎవరినీ నిందితుడిగా పేర్కొనలేదు.

సీమా పాహుజా ఎవరంటే..
ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో స్పెషల్‌ క్రైమ్స్‌ యూనిట్‌ ఎస్పీగా సీమా పాహుజా పనిచేస్తున్నారు. గతంలో సీబీఐ చండీగఢ్‌ విభాగంలోనూ సేవలందించారు. హత్రాస్‌ ఘటన, ఉన్నావ్‌ అత్యాచార కేసు, కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌లో జరిగిన అత్యాచారం-హత్య కేసు దర్యాప్తులతో పాటు సిమ్లాలోని ‘గుడియా’ అత్యాచారం హత్య కేసు దర్యాప్తులోనూ ఆమె కీలకంగా వ్యవహరించారు.  2021లో ‘బెస్ట్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్‌’గా సీమా పాహుజాకు బంగారు పతకం లభించించింది.

దిశా సాలియన్‌ కేసులో దర్యాప్తు
దిశా మృతికి సంబంధించిన పాత రికార్డులు, అందుబాటులో ఉన్న ఆధారాలను సీబీఐ బృందం మరోసారి పరిశీలించనుంది. 2020 జూన్‌ 8 రాత్రి ఆమె కాబోయే భర్త రోహన్‌ రాయ్‌ ఇంట్లో జరిగిన పార్టీకి హాజరైన వారి వాంగ్మూలాలను తొలిదశలో నమోదు చేయనున్నారు. అప్పటి పోలీసు దర్యాప్తు వివరాలు, ఘటనాస్థల రికార్డులు, ఫోరెన్సిక్‌ ఆధారాలు, ఇతర పత్రాలను కూడా పరిశీలించనున్నారు. దిశా మృతి జరిగిన కొద్ది రోజులకే సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ బాంద్రాలోని తన నివాసంలో మృతిచెందారు. రెండు ఘటనలు దాదాపు ఒకే సమయంలో జరగడంతో వాటి మధ్య సంబంధంపై అప్పట్లో అనేక ఊహాగానాలు వినిపించాయి.

ఇదీ చదవండి: ఇక చిటికెలో టీబీ గుర్తింపు.. 16 ఏళ్ల కుర్రాడి వినూత్న ఆవిష్కరణ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement