ఆ మిస్టరీ వీడకుండానే.. రియా కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌ | Riya Case: Ramanuj Goswami Dies But Sugar Daddy Mystery Continues | Sakshi
Sakshi News home page

ఆ మిస్టరీ వీడకుండానే.. రియా కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌

Sep 14 2026 12:28 PM | Updated on Sep 14 2026 12:39 PM

Riya Case: Ramanuj Goswami Dies But Sugar Daddy Mystery Continues

భార్యను అతిదారుణంగా హత్య చేసి.. ఆమె తలను భర్త ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టిన కేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించిన ఆ భర్త.. తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని మీడియా ముందే ప్రకటించుకున్నాడు. అంతేకాదు బయటకు వచ్చాక మరో హత్య చేస్తానంటూ పోలీస్‌ స్టేషన్‌ బయటే చెప్పాడు. చివరకు పోలీస్‌ కస్టడీలో ఉండగానే అతని ప్రాణం పోయింది!.

అస్సాం రాజధాని గువాహటిలో సంచలనం సృష్టించిన రియా తాలుక్దార్‌ (25) హత్య కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు, ఆమె భర్త రమానుజ్‌ గోస్వామి పోలీసు వాహనం నుంచి దూకి మృతిచెందాడు. సోమవారం వేకువ జామున ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల రమానుజ్‌ను వైద్య పరీక్షల అనంతరం సోమవారం తెల్లవారుజామున హటిగావ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నరకాసుర్‌ పహార్‌ ప్రాంతం వద్ద పోలీసులపై ఒక్కసారిగా దాడికి ప్రయత్నించిన అతడు.. కదులుతున్న వాహనం నుంచి కిందకు దూకినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి లోయలో పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు అతడిని గువాహటి మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ (GMCH)కు తరలించగా.. వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.

అతనిది పారిపోయే ప్రయత్నమా? లేదంటే కావాలనే దూకి చావాలనుకున్నాడా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే రియా కేసులో కొన్ని ప్రశ్నలకు అతని నుంచి పోలీసులు సరైన సమాధానాలు రాబట్టలేకపోయారు. దీంతో ఈ కేసు ఇంకా క్లిష్టతరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

అసలు కేసులో ఏం జరిగింది?
గువాహటి సమీపంలోని హటిగావ్‌-బసిస్థాపూర్‌ ప్రాంతంలో రమానుజ్‌, అతడి భార్య రియా తాలుక్దార్‌ (25) నివసిస్తున్నారు. దాదాపు ఆరు నెలల క్రితమే వీరికి వివాహమైంది. అయితే భార్యపై అనుమానంతో రమానుజ్‌ తరచూ గొడవపడేవాడని తెలుస్తోంది. సెప్టెంబర్‌ 3న జరిగిన గొడవలో రియాపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఆమె తలను, వేళ్లను వేరు చేసి నల్లటి పాలిథిన్‌ సంచిలో చుట్టి ఫ్రిడ్జ్‌లో దాచాడు.

దుర్వాసనతో వెలుగులోకి..
సెప్టెంబర్‌ 6న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా రియా మృతదేహం కనిపించింది. అయితే తల కనిపించలేదు. ఫ్రిడ్జ్‌ను తనిఖీ చేయగా పాలిథిన్‌ సంచిలో ఆమె తలను గుర్తించారు. ఘటన తర్వాత ఇంట్లో రమానుజ్‌ కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. చివరకు అతడు పోలీసుల ఎదుట లొంగిపోయి.. భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న రక్తపు మరకలున్న కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

‘షుగర్‌ డాడీ’ ఎవరు?
ఈ కేసులో మరో సంచలన అంశం రమానుజ్‌ చేసిన వ్యాఖ్యలు. సెప్టెంబర్‌ 8న పోలీసులు అతడిని ఘటనాస్థలికి తీసుకెళ్లిన సమయంలో మీడియాతో మాట్లాడిన రమానుజ్‌.. భార్యను చంపినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అన్నాడు. అంతేకాదు.. తన భార్య క్యారెక్టర్‌ అస్సలు మంచిది కాదని.. జైలు శిక్ష పూర్తయ్యాక బయటకు వచ్చి ఆ ‘షుగర్‌ డాడీ’ని చంపుతానంటూ హెచ్చరించాడు. ఆ వ్యక్తి ఎవరని మీడియా ప్రశ్నించగా అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో రియాకు నిజంగా ఎవరితోనైనా సంబంధం ఉందా? ‘షుగర్‌ డాడీ’గా అతడు ఎవరిని ఉద్దేశించాడు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్‌ కస్టడీలో నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేసినా.. అతను నిన్నటిదాకా నోరు విప్పలేదని తెలుస్తోంది.

మత్తులోనే హత్య చేసి..
అనుమానంతో విచారణలో రమానుజ్‌.. హత్య జరిగిన సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నట్లు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఖాళీ మద్యం సీసాలు కూడా లభించాయి. రియా కుటుంబ సభ్యులు మాత్రం రమానుజ్‌కు డ్రగ్స్‌ అలవాటు, గతంలో ఆర్థిక మోసం కేసులో అరెస్టు వంటి ఆరోపణలు చేశారు. వీటిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రమానుజ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని హత్యకు సంబంధించిన సెక్షన్‌ 103(1), ఆధారాలను మాయం చేయడానికి సంబంధించిన సెక్షన్‌ 238 కింద కేసు నమోదు చేశారు. అతడికి ఏడు రోజుల పోలీసు కస్టడీ కూడా లభించింది. అయితే విచారణ పూర్తికాకముందే పోలీసు వాహనం నుంచి దూకడంతో ఈ కేసులో కీలక ప్రశ్నలకు సమాధానాలు మిగిలిపోయాయి.

ఇదీ చదవండి: దుబాయ్‌ ఫ్లైట్‌ ఎక్కాల్సినోడు.. పాడెక్కాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement