ఎల్లలు లేని వినాయకుడు.. వివిధ దేశాల్లో.. | Countries Outside India Where Ganesha Is Worshipped | Sakshi
Sakshi News home page

ఎల్లలు లేని వినాయకుడు.. వివిధ దేశాల్లో..

Sep 14 2026 8:20 AM | Updated on Sep 14 2026 8:20 AM

Countries Outside India Where Ganesha Is Worshipped

విఘ్నాలను తొలగించే దేవుడిగా, కొత్త ఆరంభాలకు ప్రతీకగా భారతీయులు కొలిచే గణపతి దేవునికి  సరిహద్దులు లేవు. ఆసియాలోని పలు దేశాల్లో గణేశుడిని వివిధ పేర్లతో, భిన్నమైన సంప్రదాయాలతో పూజిస్తుంటారు. జపాన్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, నేపాల్, మలేషియా, కంబోడియాల్లో గణేశుని ఆరాధనలు కనిపిస్తాయి.

జపాన్‌లో ‘కాంగిటెన్’గా గణపయ్య
జపాన్‌లో గణేశుడిని కాంగిటెన్ (Kangiten)గా పూజిస్తారు. జపాన్ సంస్కృతిలో ఆయనను విఘ్నాలను తొలగించి ఆనందం, విజయం అందించే దేవుడిగా భావిస్తారు. ఇక్కడ గణేశుడి ఆరాధనకు బౌద్ధమతంతో సన్నిహిత సంబంధం ఉంది. భారత్‌లో గణపతికి మోదకాలు నైవేద్యంగా సమర్పించడం సాధారణం కాగా.. జపాన్‌లో ఆయనకు ముల్లంగిని సమర్పించే సంప్రదాయం ఉంది. జపాన్‌లోని మత్సుచియామా షోడెన్, హోజాంజిలలో కాంగిటెన్‌ ఆలయాలున్నాయి.

థాయ్‌లాండ్‌లో ‘ఫ్రా ఫికానెట్’
ప్రధానంగా బౌద్ధ దేశమైన థాయ్‌లాండ్‌లో పలు హిందూ దేవతలను కూడా భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అందులో గణేశుడు కూడా ఒకరు. ఇక్కడ ఆయనను ‘ఫ్రా ఫికానెట్’ గా పిలుస్తారు. అదృష్టం, విజయం ప్రసాదించే దేవుడిగా ఆయనను భావిస్తారు. ఆనందాన్ని అందించడంతో పాటు కష్టాలను అధిగమించే శక్తిని గణేశుడు ప్రసాదిస్తాడని స్థానికుల నమ్మకం. దేశవ్యాప్తంగా గణేశుడి విగ్రహాలు, ఆలయాలు, పూజా స్థలాలు ఉన్నాయి. స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా వీటిని సందర్శిస్తారు.

ఇండోనేషియా.. బాలిలో ప్రత్యేక స్థానం
ఇండోనేషియాలో ముఖ్యంగా బాలిలో గణేశుడికి విశిష్ట స్థానం ఉంది. అదృష్టం, జ్ఞానం, కొత్త ఆరంభాలకు నెలవైన దేవుడిగా గణేశుడిని పూజిస్తారు. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తుశకం 7వ, 8వ శతాబ్దాల నాటికే ఇండోనేషియాలో గణేశుడు ముఖ్యమైన దేవతగా గుర్తింపు పొందాడు. అక్కడి కొన్ని హిందూ సమాజాల్లో విష్ణువు, శివుడు, సరస్వతితో పాటు గణేశుడిని కూడా ఆరాధిస్తారు. ఇండోనేషియా ప్రాచీన సంస్కృతి, కళల్లోనూ గణేశుడి ప్రాతినిధ్యం కనిపిస్తుంది.

నేపాల్‌లో శుభప్రద దేవుడిగా..
నేపాల్‌లో గణేశుడిని గణేశ, గణపతి, వినాయక వంటి పేర్లతో పిలుస్తారు. ముఖ్యంగా హిందూ నేవార్ సమాజంలో ఆయనను అదృష్టాన్ని ప్రసాదించే దేవుడిగా పూజిస్తారు. భారత్‌లో మాదిరిగానే అక్కడ కూడా మతపరమైన కార్యక్రమాలను ప్రారంభించే ముందు గణేశుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది. నేపాల్‌లో పలు గణేశ ఆలయాలు ఉన్నాయి. రాజధాని ఖాట్మండులోని మారూ గణేశ్, భక్తపూర్‌లోని సూర్య వినాయక ఆలయాలు వాటిలో ప్రముఖమైనవిగా చెబుతుంటారు

మలేషియాలోనూ వినాయక చవితి
మలేషియాలో హిందువులు అధికంగా కనిపిస్తారు. అక్కడ కూడా గణేశుడిని కొత్త ఆరంభాలకు ప్రతీకగా, విఘ్నాలను తొలగించే దేవునిగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం గణేశ చతుర్థిని కూడా నిర్వహిస్తారు. అదృష్టం కోసం పలువురు తమ ఇళ్లలో గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించుకుంటారు. మలేషియాలోని శ్రీ సిద్ధి వినాయగర్ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది.

కంబోడియాలో శతాబ్దాల చరిత్ర
కంబోడియాలో గణేశుడి ఆరాధనకు శతాబ్దాల చరిత్ర ఉంది. క్రీస్తుశకం 5వ-6వ శతాబ్దాల నుంచే అక్కడ గణేశుడిని పూజించినట్లు చరిత్ర చెబుతోంది. శైవ హిందూ సంప్రదాయం వ్యాప్తి ద్వారా గణేశుడి ఆరాధన అక్కడికి చేరినట్లు చెబుతారు. ఖ్మేర్ సామ్రాజ్య కాలానికి చెందిన కళల్లోనూ గణేశుడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. శిల్పాలు, చెక్కడాల్లో ఆయన రూపాలు దర్శనమిస్తాయి. ప్రజలు గణేశుడిని విముక్తిని ప్రసాదించే, విఘ్నాలను తొలగించే దేవునిగా భావిస్తారు. కంబోడియాలోనూ పలు గణపతి ఆలయాలు కనిపిస్తాయి.

ఇదీ చదవండి: 45 ఏళ్లుగా గణేశ్‌ వేడుకల్లో మారుమోగుతూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement