రోజూ కొండప్రాంతం ఎక్కిదిగుతున్న 55 ఏళ్ల ప్రభుత్వటీచర్
మహారాష్ట్రలో అంకితభావం చాటుతున్న ఉపాధ్యాయుడు
కొల్హాపూర్: రోజూ ఉదయం ప్రభుత్వపాఠశాలలో బోధించేందుకు వెళ్లాలంటే ప్రతి టీచర్ సొంత వాహనం లేదా ఆర్టీసీ బస్సులో ప్రయాణం మొదలెడతారు. కానీ 55 ఏళ్ల ఉపాధ్యాయుడు జీవన్ వసంతరావ్ మిథారీ మాత్రం రోజూ రానుపోను 5 కిలోమీటర్లు కొండప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తూ పాఠశాలకు వెళ్లివస్తున్నారు. దట్టమైన అడవి, ఎడతెరపి వానలు, వన్యప్రాణుల నుంచి ప్రాణహాని ఉన్నా వాటిని తట్టుకుంటూ ఒకే ఒక్క విద్యార్థికి పాఠాలు చెప్పేందుకు గత 13 ఏళ్లగా తన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ అంకితభావంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
సహ్యాద్రి పర్వతశ్రేణిలో కొల్హాపూర్ జిల్లాలోని గగన్‌బవాడ తాలూకాలో కొండ మీద కవాల్‌టెక్ ధంగర్‌వాడా అనే మారుమూల గ్రామం ఉంది. అక్కడ పాతికేళ్ల క్రితం దాదాపు 100 కుటుంబాలు ఉండేవి. తర్వాత జీవనోపాధి కోసం దాదాపు కుటుంబాలన్నీ కొల్హాపూర్ నగరానికి వలసవచ్చాయి. ఒకటీ రెండు కుటుంబాలే అక్కడ ఉన్నాయి. వారిలో మూడో తరగతి చదవే స్వర బొడాకే ఒక్కతే అక్కడి జిల్లాపరిషత్ స్కూల్‌కు వస్తోంది. ఈమెకు చదువు చెప్పేందుకే టీచర్ మిథారీ రోజూ 2.5 కిలోమీటర్లు పైకి ట్రెక్కింగ్‌చేసి స్కూల్ అయ్యాక మళ్లీ 2.5 కి.మీ.లు కిందకు దిగొస్తున్నారు.
‘‘కొల్హాపూర్ జిల్లా ప్రైమరీ స్కూల్ టీచర్స్ సహకార బ్యాంక్‌కు గతంలో చైర్మన్‌గా ఉన్నా. అప్పుడు నాలాంటి ప్రతిభావంతులైన టీచర్లకు పట్టణాల్లో పోస్టింగ్‌లు ఇచ్చి ఇతరులకు కుగ్రామాల్లో పోస్టింగ్‌లు ఇస్తారని ఒకరు నాతో అన్నారు. అది తప్పు అని నిరూపించేందుకే ఈ పాఠశాలను నేనే ఎంచుకున్నా. సాయంత్రం ఆలస్యమైతే అడవి దున్నల వంటి వన్య ప్రాణాలతో ముప్పు ఎక్కువ. అందుకే ఉదయం చాలా త్వరగా స్కూల్‌కు ఆరోజు సిలబస్ మొత్తం చెప్పి త్వరగా వెనుతిరుగుతా. స్వర చెల్లెలు అంగన్‌వాడీ లేకపోవడంతో ఆ పాప కూడా బడికొస్తోంది. వచ్చే ఏడాది ఆమె ఒకటో తరగతిలో చేరబోతోంది’’అని టీచర్ నవ్వుతూ చెప్పారు. కవాల్‌టెక్ ధంగర్‌వాడా గ్రామానికి విద్యుత్ సౌకర్యంలేదు.


