ఒక చేతిలో ‘బ్రహ్మోస్‌’.. మరో చేతిలో సెమీకండక్టర్‌ చిప్‌.. | Ganeshotsav Celebrations Take a Modern Turn in Delhi | Sakshi
Sakshi News home page

ఒక చేతిలో ‘బ్రహ్మోస్‌’.. మరో చేతిలో సెమీకండక్టర్‌ చిప్‌..

Sep 13 2026 1:51 PM | Updated on Sep 13 2026 1:51 PM

Ganeshotsav Celebrations Take a Modern Turn in Delhi

న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గణేశోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్‌ 14 నుంచి పది రోజులపాటు దేశభక్తి, సాంస్కృతిక అంశాలతో మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముంబై, చెన్నైతో పాటు దక్షిణాది కళాకారులు ఢిల్లీకి రానున్నారు. ‘ఢిల్లీ కా మహారాజా’ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి వినూత్న థీమ్‌ను ఎంచుకున్నారు. 9 అడుగుల గణపతి విగ్రహం చేతుల్లో సంప్రదాయ వస్తువులకు బదులుగా బ్రహ్మోస్‌ క్షిపణి, డ్రోన్‌, సెమీకండక్టర్‌ చిప్‌ను ఉంచారు. ‘విఘ్నహర్త నుంచి వికాసకర్త’ అనే ఇతివృత్తంతో దేశ పురోగతిలో సాంకేతికత, భద్రత, యువత పాత్రను చాటనున్నారు. 80 అడుగుల ప్రదర్శన వేదికపై సంప్రదాయ ఆలయాలు, రాకెట్లు, డ్రోన్లు, 10 అడుగుల బుల్లెట్‌ రైలు నమూనాలను ప్రదర్శించనున్నారు.

2,100 శంఖాలతో ఘన ప్రారంభం
లాల్‌బాగ్‌ కా రాజా గణపతి మహోత్సవం సెప్టెంబర్‌ 14న ప్రారంభం కానుంది. రాత్రి 7.30 గంటలకు 2,100 మంది భక్తులు ఒకేసారి శంఖాలు ఊది కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం ముంబైలోని లాల్‌బాగ్‌చా రాజా విగ్రహాలను రూపొందించే కళాకారులు తయారుచేసిన 18 అడుగుల గణపతి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రోజుకు సుమారు 20 వేల నుంచి 25 వేల మంది భక్తులు దర్శనానికి వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

ఢిల్లీలో మహారాష్ట్ర సందడి
29వ సార్వజనిక గణేశ్‌ ఉత్సవంలో మహారాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించనుంది. మరాఠీ గజల్స్‌, నాటకాలు, లావణి, సంగీత కార్యక్రమాలతో పాటు పూరణ్‌ పోళీ, ఉక్కడిచే మోదక్‌ వంటి సంప్రదాయ వంటకాలు అందుబాటులో ఉంటాయి. పైఠణీ, ఇర్కల్‌ చీరల విక్రయాలు, ప్రత్యేక నిమజ్జన ఊరేగింపు కూడా నిర్వహించనున్నారు.

చెన్నై కళాకారుల గణపయ్య
మయూర్‌ విహార్‌లోని శ్రీ శుభ సిద్ధి వినాయక మందిరంలో చెన్నై కళాకారులు రూపొందించిన నాలుగు అడుగుల గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సెప్టెంబర్‌ 14న 25 మూలమంత్ర జపం అనంతరం 5,000 మోదకాలను నైవేద్యంగా సమర్పించనున్నారు. దక్షిణాది కళాకారులు సంప్రదాయ భజనలు నిర్వహించనున్నారు.

నోయిడాలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలు
నోయిడాలోని శ్రీ వరసిద్ధి వినాయక మందిరంలో ఐదు రోజులపాటు గణేశ్‌ చతుర్థి వేడుకలు జరగనున్నాయి. హవనం, అభిషేకాలు, సహస్రనామ పారాయణాలతో పాటు భరతనాట్యం, వేణుగానం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: అద్దెకు ఫైబర్ గణేశుడు.. 10 అడుగుల విగ్రహం మూడు వేలకే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement