ఇద్దరూ భారత్‌లోనే పుట్టారు.. వేర్వేరు కుటుంబాలకు దత్తత వెళ్లారు.. కట్ చేస్తే.. నెదర్లాండ్స్‌లో ఒకరికొకరు దగ్గర్లోనే పెరిగారు. టీనేజ్‌లో తొలిసారి కలిసినప్పుడు ఇద్దరి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. ఒకే ముక్కు.. ఒకే నవ్వు.. ఒకే రకమైన హావభావాలు. అందుకే అప్పట్లోనే ఒకరినొకరు సరదాగా ‘సిస్టర్’ అని పిలుచుకునేవారు. కానీ వాళ్లు నిజంగానే అక్కాచెల్లెళ్లని మాత్రం దాదాపు 30 ఏళ్ల వరకు ఎవరికీ తెలియదు. చివరకు ఓ డీఎన్‌ఏ టెస్ట్ వాళ్ల జీవితాలనే మార్చేసింది.
ముంబైలోని వేర్వేరు అనాథాశ్రమాల నుంచి 1980ల ప్రారంభంలో కొన్ని నెలల వ్యవధిలో మీనా గెల్టింక్, మినాల్ టిజ్సెన్ వేర్వేరు డచ్ కుటుంబాలకు దత్తత వెళ్లారు. ఇద్దరూ నెదర్లాండ్స్‌లో ఒకరికొకరు సమీపంలో పెరిగారు. టీనేజ్‌లో దత్తత పిల్లల కోసం నిర్వహించిన ఓ కార్యక్రమంలో తొలిసారి కలుసుకున్నారు. అప్పుడు వారి స్నేహితులే ఇద్దరి పోలికలను గుర్తించారు. అద్దంలో చూసుకుంటే ఒకేలా కనిపిస్తున్నారని చెప్పడంతో మీనా ఆశ్చర్యపోయింది. ఒకే ముక్కు, ఒకే నవ్వు ఉండటాన్ని గమనించింది.
ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. స్కూల్, స్నేహితులు, ప్రేమ, డ్యాన్స్, క్రీడలు, సంగీతం.. ఇలా ఎన్నో విషయాలను ఒకరికొకరు లేఖల ద్వారా పంచుకునేవారు. ఇద్దరికీ బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ అంటే ఇష్టమని కూడా తెలుసుకున్నారు. రక్తసంబంధం ఉందన్న చిన్న అనుమానం కూడా లేకపోయినా.. ఒకరినొకరు ‘సిస్టర్’ అని పిలుచుకునేవారు. అయితే సుమారు 15 ఏళ్ల క్రితం ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయింది. మినాల్ ఫ్రాన్స్‌కు వెళ్లగా.. మీనా తన మొదటి బిడ్డకు తల్లి కావడంతో కుటుంబ బాధ్యతల్లో బిజీ అయిపోయింది.
డీఎన్‌ఏ టెస్ట్..
ఇంతలో 2017లో మీనా భారత్ నుంచి దత్తత తీసుకున్నవారి సమావేశానికి హాజరైనప్పుడు డీఎన్‌ఏ టెస్టింగ్ గురించి తెలుసుకుని పరీక్ష చేయించుకుంది. కానీ ఎలాంటి సరిపోలిక కనిపించలేదు. ఈ ఏడాది ఫోన్ స్టోరేజ్ సమస్యతో ఆమె ఆ యాప్‌ను కూడా డిలీట్ చేసింది. ఇంతలో మే 20న మినాల్ ఫేస్‌బుక్‌లో మీనాకు మెసేజ్ చేసింది. తాను ఏప్రిల్‌లో డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకున్నానని, ఫలితాల స్క్రీన్ షాట్‌ను పంపింది. మీనాకు మొదట నమ్మశక్యం కాలేదు. యాప్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేసి ఫలితాలను చూసిన ఆమెకు షాక్ తగిలింది. ఇద్దరి డీఎన్‌ఏ 100 శాతం మ్యాచ్ అయింది. వారు కేవలం చిన్ననాటి స్నేహితులు కాదు.. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పూర్తి సోదరీమణులని తేలింది.

మినాల్‌కు కూడా తొలుత తన డీఎన్‌ఏ మ్యాచ్ ఎవరిదో అర్థం కాలేదు. సోషల్ మీడియాలో పాత ఫొటోలు చూసిన తర్వాత విషయం తెలిసింది. చిన్నప్పుడు తనను ఆప్యాయంగా పట్టుకున్న అదే అమ్మాయి మీనా అని గుర్తించింది. దాదాపు 30 ఏళ్ల క్రితం ఏర్పడిన స్నేహం వెనుక ఇంత పెద్ద రక్తసంబంధం ఉందని తెలుసుకుని ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. ఆగస్టులో మళ్లీ కలుసుకున్న ఇద్దరూ కన్నీళ్లు, నవ్వులు, కౌగిలింతల మధ్య తమ అనుబంధాన్ని జరుపుకున్నారు. ఇప్పుడు తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. ఒకరి కుటుంబాలను మరొకరు కలుసుకున్నారు. ఇద్దరి మాట తీరు, నడక, హావభావాలు ఇప్పటికీ ఒకేలా ఉన్నాయని కుటుంబ సభ్యులు గుర్తిస్తున్నారు.
ముంబై కోరిక..
తమ జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో ఒకరి అవసరం మరొకరికి ఉందని మీనా చెబుతోంది. తండ్రిని కోల్పోయినప్పుడు, జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు సోదరి తన పక్కన ఉంటే బాగుండేదని భావోద్వేగానికి గురైంది. ఇప్పుడు ఇద్దరి కోరిక ఒక్కటే.. తమ బంధం మొదలైన ముంబైకి కలిసి వెళ్లి, తాము పుట్టిన నేలను మరోసారి చూడాలని కోరుకుంటున్నారు. దాదాపు 30 ఏళ్లుగా ‘సిస్టర్’ అని పిలుచుకున్న ఇద్దరు మహిళలు.. చివరకు డీఎన్‌ఏ ద్వారా తాము నిజంగానే సోదరీమణులమని తెలుసుకున్న ఈ కథ నిజజీవితంలో జరిగిన ఓ సినిమా ట్విస్ట్‌ను తలపిస్తోంది.
Çocukluk arkadaşları, yıllar sonra yaptırdıkları DNA testiyle aslında kardeş olduklarını öğrendi! 👯♀️💞
📌 Bebekken Hindistan'daki yetimhanelere bırakılan ve farklı Hollandalı aileler tarafından evlat edinilen Meena Geltink ile Minal Tijssen, ilk kez 1996 yılında evlat edinilmiş… pic.twitter.com/NyMrp7DBu0— Mynet (@mynet) August 17, 2026
Video Credit: Mynet.


