రెట్రోతో జాగ్రత్త | 1980s images trending on social media | Sakshi
Sakshi News home page

రెట్రోతో జాగ్రత్త

Sep 13 2026 3:33 AM | Updated on Sep 13 2026 3:33 AM

1980s images trending on social media

ఫొటో ఇచ్చి ఫ్యూచర్‌ను ప్రమాదంలో పెట్టొద్దు 

సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా 1980ల నాటి చిత్రాలు

ఏఐతో పాతకాలం లుక్‌ తెచ్చుకుంటున్న నెటిజన్లు 

సరదా కోసం అప్‌లోడ్‌ చేస్తున్న ఫొటోలతో వ్యక్తిగత డేటాకు ముప్పు  

ముఖ గుర్తింపు డేటాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు 

ఏఐ యాప్‌ నిబంధనలు పరిశీలించాకే ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలని నిపుణుల సూచన

సాక్షి, అమరావతి: రెట్రో.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ ట్రెండ్‌. నేటి ఫొటోలను 1980ల కాలం నాటి చిత్రాల్లా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరు కృత్రిమమేధ (ఏఐ) యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. అప్పటి దుస్తులు, హెయిర్‌స్టైల్, కెమెరా ఎఫెక్ట్, ఫొటో క్వాలిటీతో తమ చిత్రాలను మార్చుకుని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. సరదాగా కనిపిస్తున్న ఈ ట్రెండ్‌ వెనుక అంతే ప్రమాదం పొంచి ఉంది. ఏఐ ఫొటో ఎడిటింగ్‌ యాప్‌కు చిత్రాన్ని అప్‌లోడ్‌ చేసినప్పుడు ఆ ఫొటోలోని ముఖాన్ని సాంకేతికంగా విశ్లేషించే అవకాశం ఉంటుంది. 

ముఖ ఆకృతి, కళ్లు, ముక్కు, పెదవులు తదితర అవయవాల లక్షణాలను గుర్తించే ప్రక్రియలో బయోమెట్రిక్‌ సమాచారానికి సంబంధించిన అంశాలుంటాయి. అందుకే ముఖానికి సంబంధించిన డేటాను సాధారణ ఫొటోగా మాత్రమే చూడలేమని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఎస్‌టీ) దాదాపు 200 ముఖగుర్తింపు అల్గారిథమ్‌లను పరీక్షించింది. ఈ పరిశీలనలో వయసు, లింగం, జాతి, దేశ నేపథ్యం వంటి అంశాల ఆధారంగా అల్గారిథమ్‌ల పనితీరులో తేడాలున్నట్లు గుర్తించింది.

పరీక్షల్లో 1.8 కోట్లకుపైగా చిత్రాలు, 84.9 లక్షలమందికి సంబంధించిన డేటా ఉపయోగించారు. థర్డ్‌పార్టీ యాప్‌లలో వ్యక్తిగత వివరాలు, కుటుంబ ఫొటోలు ఇవ్వడం వల్ల వాటిని మార్ఫింగ్‌ చేసి అసభ్యంగా చిత్రీకరించి డబ్బులివ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ప్రస్తుతం తమ దృష్టికి వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

బయటకు వెళితే ప్రమాదం  
యూరోపియన్‌ డేటా ప్రొటెక్షన్‌ బోర్డు (ఈడీపీబీ) ముఖగుర్తింపు సాంకేతికతలో ఉపయోగించే బయోమెట్రిక్‌ డేటా అత్యంత సున్నితమైనదని పేర్కొంది. దాని దుర్వినియోగం జరిగితే వ్యక్తిగత వివరాల దొంగతనం, వ్యక్తి పేరుతో మోసాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. 2024లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) మోడళ్లలో వ్యక్తిగత డేటా వినియోగంపై ఈడీపీబీ ప్రత్యేక అభిప్రాయాన్ని కూడా విడుదల చేసింది. ఏఐ మోడళ్ల అభివృద్ధి, వినియోగంలో వ్యక్తిగత సమాచారాన్ని ఎలా ప్రాసెస్‌ చేస్తున్నారనే అంశంపై స్పష్టమైన నిబంధనలు, చట్టబద్ధత అవసరమని పేర్కొంది. 

కొన్నిసేవల నిబంధనల్లో వినియోగదారులు అప్‌లోడ్‌ చేసే కంటెంట్‌ను సేవ మెరుగుదల, పరిశోధన లేదా ఏఐ మోడళ్ల అభివృద్ధి వంటి ప్రయోజనాలకు ఉపయోగించే హక్కులు సంస్థకు ఉండవచ్చు. ప్రతి యాప్‌ నిబంధనలు ఒకేలా ఉండవు. అందుకే ఉచితంగా ఫొటో మార్చుకోవచ్చు.. అన్న కారణంతో ఏ యాప్‌కైనా వ్యక్తిగత చిత్రాలను ఇవ్వడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. 

డిలీట్‌ చేస్తే అయిపోయినట్టు కాదు
ఫోన్‌లోగానీ, యాప్‌లోగానీ మనం ఏదైనా ఫొటోను డిలీట్‌ చేస్తే అది పూర్తిగా డిలీట్‌ అయినట్టేనా అనేది ఇప్పుడు అందరిలోనూ ఉన్న ప్రధాన సందేహం. ఏఐ యాప్‌లో ఫొటో అప్‌లోడ్‌ చేసేముందు ఆ సంస్థ ఫొటోలను ఎంతకాలం నిల్వచేస్తుంది? డిలీట్‌ చేసిన తర్వాత బ్యాకప్‌ కాపీలు ఉంటాయా? ఏఐ మోడల్‌ శిక్షణకు ఉపయోగిస్తారా? మూడోపక్ష (థర్డ్‌ పార్టీ) సంస్థలతో పంచుకుంటారా? వంటి అంశాలను ప్రైవసీ పాలసీలో పరిశీలించాలి. 

అమెరికా ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (ఎఫ్‌టీసీ) గతంలోనే ముఖగుర్తింపు సాంకేతికతను ఉపయోగించే సంస్థలు వినియోగదారులకు డేటా ఎలా ఉపయోగిస్తారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని, ఒక ప్రయోజనం కోసం సేకరించిన ముఖం లేదా బయోమెట్రిక్‌ డేటాను ఇతర ప్రయోజనానికి ఉపయోగించేముందు స్పష్టమైన సమ్మతి తీసుకోవాలని సూచించింది. రెట్రో ఫొటో రెండు నిమిషాల్లో తయారవుతుంది. కానీ ఒకసారి మన ముఖం, వ్యక్తిగత డేటా ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడం అంత సులభం కాదు. ట్రెండ్‌కోసం ఫొటో ఇచ్చే ముందు.. ఆ యాప్‌ మన డేటాతో ఏం చేస్తుందో తెలుసుకోవడం తప్పనిసరి.

సరదాగా రిస్క్‌ చేయవద్దు 
» తెలియని ఏఐ ఫొటో యాప్స్‌లో వ్యక్తిగత చిత్రాలు అప్‌లోడ్‌ చేయవద్దు. 
» యాప్‌ ప్రైవసీ పాలసీని ముందుగా చదవాలి.
» ఫొటోలను ఏఐ మోడల్‌ శిక్షణకు ఉపయోగిస్తారా? తెలుసుకోవాలి.  
» మూడోపక్ష సంస్థలతో డేటా పంచుకుంటారా? పరిశీలించాలి.
» డేటా తొలగింపు సదుపాయం ఉందో చూడాలి.  
» ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి పత్రాలు కనిపించే ఫొటోలు అస్సలు అప్‌లోడ్‌ చేయవద్దు. 
» పిల్లలు, కుటుంబసభ్యుల ఫొటోలను కూడా అవసరం లేకుండా థర్డ్‌పార్టీ యాప్స్‌కు ఇవ్వకపోవడమే మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement