డీఎస్సీపై నిజాయితీ నిరూపించుకోండి | Opposition Leader Botsa Satyanarayana in Legislative Council | Sakshi
Sakshi News home page

డీఎస్సీపై నిజాయితీ నిరూపించుకోండి

Sep 13 2026 3:15 AM | Updated on Sep 13 2026 3:15 AM

Opposition Leader Botsa Satyanarayana in Legislative Council

అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించండి 

కరువు పరిస్థితులపై తీసుకున్న చర్యలేమిటి 

శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ

సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు అమ్ము­కున్నారు. ఇదే విషయాన్ని మేం ధైర్యంగా చెబుతున్నాం. అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోండి’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. శని­వారం విజయనగరంలో వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తత­స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలపై అసెంబ్లీలోను, బయట చాలె­ంజ్‌ చేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ శాస­నమండలిలో ఎందుకు చాలెంజ్‌ చేయడం లేదని ప్రశ్నించారు. 

డీఎస్సీ నియామకాలపై తప్పుగా మాట్లాడితే కేసులు పెడతామంటూ అధికారులతో చెప్పించడం సిగ్గుచేటన్నారు. నారా లోకేశ్‌ నీతిమంతుడైతే తక్షణమే విచారణకు ఆదేశించాలన్నారు. 2006లో వోక్స్‌వ్యాగన్‌ అంశంలో తన­పై ఆరోపణలు వచ్చాయని, తానే స్వయంగా సీబీఐ విచారణ జరిపించు­కుని నిజాయితీని నిరూపించుకున్నట్టు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో పోలీస్‌ వ్యవస్థపై నమ్మకంపోవడం ప్రజాస్వామ్యంలో దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 

వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోస్టులు పెడితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, మహిళా కార్యకర్తలపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టడం దారుణమన్నారు. టీడీపీ వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయకపోవడం దౌర్భాగ్యమన్నారు. ఈ పరిస్థితిలోనూ రైతులకు ఒక యూరియా బస్తా దొరకని పరిస్థితి ఉందన్నారు.  

చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరం: కన్నబాబు
పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. రెండు రోజులపాటు  నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు సమీక్షలు కాదు ఫలితాలు కావాలంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ బాధ్యతగల ప్రతిపక్షంగా అదే చెబుతోందన్నారు. ఉదయం ఇచ్చిన పింఛన్‌ డబ్బులు సాయంత్రానికి మద్యం తాగేస్తున్నారని, ఎవరికి పింఛన్‌ ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో వెరిఫై చేయాలని చెప్పడం వెనుక చంద్రబాబు ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. 

కొత్తగా పింఛన్లు ఇస్తామని రెండున్నరేళ్ల తరువాత ప్రకటించి, పింఛన్ల కోసం కుటుంబాలు విడిపోయాయా లేదా అని సర్వే చేయాలనడం సరికాదన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్యాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నా తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పు­డు ఇంటింటికీ మద్యం సరఫరా చేసే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న ప్రతి 4 మద్యం బాటిళ్లలో ఒక నకిలీ బాటిల్‌ ఉంటోందన్నారు.

డీఎస్సీలో పేకాట ఆడినవారికి ఉద్యోగాలిస్తామని చంద్రబాబు చెప్పడం విచారకరమన్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులుగా సర్టిఫికెట్లు జారీచేసి ఉపాధ్యాయ ఉద్యోగాలను అమ్ముకున్నారన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్‌నా«థ్, పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement