‘హనుమాన్ అంశ్’.. హిందీ సినిమా విడుదలైన తరువాత చాలామంది నీమ్ కరోలీ బాబా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. నీమ్ కరోలి బాబా.. మహరాజ్ జీగా కూడా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గురువు. ఆయన లోతైన ఆధ్యాత్మిక బోధనలను ఎంతో ప్రశాంతతను అందిస్తాయని పలువురు చెబుతుంటారు. కష్టాలను ఎదుర్కొనే సమయంలో.. జీవితంలోని సత్యాలను అంగీకరించడంపై ఆయన బోధనలు ప్రధానంగా దృష్టి సారించాయి. నిజాయతీగా జీవించడం, క్షమించడం ఎంతో ముఖ్యమని ఆయన నొక్కిచెప్పారు. భౌతిక వస్తువులన్నీ శాశ్వతం కాదని, దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనదని మహరాజ్ జీ వివరించారు. ఈ బోధనలు అంతర్గత ప్రశాంతతను అందించడంతోపాటు ప్రతికూల పరిస్థితులను తట్టుకునే సామర్థ్యానికి దోహదపడతాయి.
నీమ్ కరోలీ బాబా తన మాటలు, చేతలతో కోట్లాది మంది హృదయాలను ప్రభావితం చేశారు. ‘మిరాకిల్ బాబా’గా కూడా పేరొందిన ఈయన.. హనుమంతుడి భక్తుడు. జీవితంలోని అత్యంత కఠినమైన సవాళ్లను అధిగమించేందుకు సహాయపడే నాలుగు శక్తివంతమైన నీమ్ కరోలీ బాబా బోధనలు ఇవే..
1. ‘మీరు బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా ఏదైనా అంత్యక్రియలను చూసినప్పుడు.. జీవిత సత్యాలను వాస్తవంగా నేర్చుకుంటారు’
ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఎదురవుతుంటాయి. ఇది విశ్వంలోని సహజ నియమం. కొన్నిసార్లు వర్షం పడుతుంది.. మరికొన్నిసార్లు ఎండ కాస్తుంది. కష్టాలను ఎదుగుదలకు అవకాశాలుగా మార్చుకునే నైపుణ్యాన్ని అలవర్చుకోవడం ఇక్కడ కీలకమైనది. కఠిన పరిస్థితులను జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సత్యాలను నేర్చుకునే కాలంగా పరిగణించాలని నీమ్ కరోలీ బాబా చెప్పారు. ఆధునిక మనస్తత్వశాస్త్రంలో ఈ వైఖరినే ‘మానసిక స్థైర్యం’గా పిలుస్తారు.
2. ‘సంపూర్ణ నిజాయితీ, సత్యం అత్యవసరం. మీరు చెప్పిన దాని ప్రకారమే జీవించాలి’
ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగేందుకు మనం పెంపొందించుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణాల్లో నిజాయతీ ఒకటి. దాచాల్సిన విషయం ఏదైనా ఉన్నప్పుడు మనుషులు భయపడతారు. మీతో మీరు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు నిజం చెప్పడం ప్రారంభించినప్పుడు.. వెలుగు వచ్చిన వెంటనే చీకటి మాయమైనట్లుగా భయం కూడా మీ నుంచి దూరమవుతున్న అనుభూతి కలుగుతుంది. ఈ ప్రపంచంలో సత్యమే గొప్ప శక్తి. ఈ వెలుగును ఎప్పటికీ వదులుకోవద్దు.
3. ‘క్షమించడమే గొప్ప ఆయుధం. ఎందుకంటే ఆ ఆయుధం కలిగిన వ్యక్తి చలించనివాడిగా ఉంటాడు. అతను వెంటనే కోపాన్ని వదులుకోగలుగుతాడు’
ద్వేషం, పగ, అసూయ మొదలైనవి మన ప్రశాంతతను, అంతర్గత సామరస్యాన్ని నిశ్శబ్ద వ్యాధిలా దెబ్బతీసే ప్రతికూల భావాలు. వీటిని వదిలేయడం అనేది మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మరో గొప్ప శక్తి. వదిలేయడాన్ని అలవర్చుకునే కళను నేర్చుకునేందుకు ధ్యానం ఒక గొప్ప సాధనగా ఉపయుక్తమవుతుంది.
నిటారుగా వెన్నెముకను ఉంచి సౌకర్యంగా కూర్చొని, మీలో ఉద్భవిస్తున్న ఆలోచనలు, భావోద్వేగాలను గమనించండి. అవి వచ్చి వెళ్లిపోతున్నాయనే సత్యాన్ని గుర్తించండి. వాటికి ప్రతిస్పందించవద్దు. ఈ సాధనను ప్రతిరోజూ కొనసాగిస్తే.. మీ అంతరంగంలో ప్రశాంతత నెలకొంటున్న అనుభూతిని గుర్తిస్తారు.
4. ‘దేవుని ప్రేమ తప్ప ప్రతిదీ అశాశ్వతమే’
ఈ భౌతిక ప్రపంచంతో మనల్ని మనం అంటిపెట్టుకోవడం ఎప్పటికీ దుఃఖానికే దారితీస్తుంది. ఎందుకంటే ఏది ఉద్భవిస్తుందో అది అంతరించిపోతుంది. ఏదీ శాశ్వతంగా ఉండదు. అయితే మన ఆత్మల్లో ఉన్న దైవిక తత్వం శాశ్వతమైనది. అది నిత్యమైనది, మార్పులేనిది. ఈ సత్యంపై ధ్యానం చేయండి.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు సూచించిన విధంగా కర్మయోగాన్ని ఆచరించండి. మీ విధులను నిర్వర్తించండి.. ఫలితాల విషయంలో మీకు మీరు అతిగా ఆపాదించుకోవద్దు. మీ కర్మలను దేవుని పాదాల వద్ద అర్పించండి. జనన మరణాల శాశ్వత చక్రం నుంచి విముక్తి పొందేందుకు, ముక్తి లేదా మోక్షాన్ని సాధించేందుకు ఇదే ఏకైక మార్గం.
ఇదీ చదవండి: వీఐపీ కల్చర్‌కు దూరంగా.. రైలెక్కిన గవర్నర్


