ఒకవైపు హార్ముజ్ జలసంధి.. మరోవైపు బాబ్ ఎల్-మండేబ్! ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన రెండు సముద్ర ద్వారాలపైనా ముప్పు పెరగడంతో భారత్‌కు కొత్త తలనొప్పి మొదలైంది. యెమెన్ తీరంలో కేవలం 18 గంటల్లో హౌతీలు చేపట్టిన మెరుపు దాడులు ఇప్పుడు ప్రపంచ దృష్టిని బాబ్ ఎల్-మండేబ్‌పైకి మళ్లించాయి. ఈ కీలక జలసంధిపై హౌతీలు పట్టు సాధించారు. దీంతో, గల్ఫ్ చమురు సరఫరాల నుంచి భారత్-యూరప్ వాణిజ్యం వరకు దాని ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే హార్ముజ్ సంక్షోభంతో ఇంధన సరఫరాలపై ఒత్తిడి ఎదురవుతున్న వేళ.. మరో సముద్ర మార్గం కూడా ప్రమాదంలో పడటం భారత్‌కు డబుల్ షాక్‌గా మారే అవకాశముంది.
బాబ్ ఎల్-మండేబ్ ఎందుకంత కీలకం?
యెమెన్, జిబౌటీ మధ్య ఉన్న బాబ్ ఎల్-మండేబ్ సుమారు 29 కిలోమీటర్ల వెడల్పు గల కీలక జలసంధి. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఆపై అరేబియా సముద్రంతో అనుసంధానించే ఈ మార్గం.. సూయజ్ కాలువ ద్వారా యూరప్, ఆసియా మధ్య సముద్ర వాణిజ్యానికి ప్రధాన ద్వారం. చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, కంటైనర్ సరుకులు, పారిశ్రామిక ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఈ మార్గం గుండా రవాణా అవుతాయి. భారత్‌కు ఈ మార్గం మరింత కీలకం. దేశం నుంచి యూరప్‌కు డీజిల్, ఏవియేషన్ ఇంధనం, ఔషధాలు, వస్త్రాలు, యంత్ర పరికరాలు సహా అనేక ఉత్పత్తులు సూయజ్ మార్గం మీదుగా వెళ్తాయి. ఈ మార్గానికి అంతరాయం ఏర్పడితే భారత ఎగుమతుల రవాణా ఖర్చులు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది.
హౌతీల మెరుపు దాడులు
తాజా పరిణామాల్లో హౌతీలు యెమెన్ ఎర్ర సముద్ర తీరంలో వేగంగా ముందుకు సాగినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. వ్యూహాత్మకమైన మోఖా పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు రాయిటర్స్ వెల్లడించగా.. బాబ్ ఎల్-మండేబ్‌లో కీలక స్థానంలో ఉన్న మయూన్ (పెరిమ్) ద్వీపం కూడా హౌతీల ఆధీనంలోకి వెళ్లినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. జుకర్, హనిష్ దీవుల వైపునకు కూడా వారు చేరుకున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ పరిణామాలతో బాబ్ ఎల్-మండేబ్ ప్రవేశ మార్గాలపై హౌతీల నియంత్రణ పెరిగింది. హౌతీ నేతలు ఇప్పటికే ఈ జలసంధిపై తమ ఆధిపత్యాన్ని ప్రకటించారు.
మూసుకుపోతే ఏం జరుగుతుంది?
బాబ్ ఎల్-మండేబ్‌లో నౌకల రాకపోకలకు ముప్పు ఏర్పడితే.. షిప్పింగ్ కంపెనీలు ఈ మార్గాన్ని దాటేందుకు వెనుకడుగు వేసే అవకాశం ఉంది. సముద్ర బీమా ప్రీమియాలు పెరగడం, నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లడం అనివార్యంగా మారొచ్చు. 2023లో హౌతీల దాడుల సమయంలోనే దీనికి ఉదాహరణ కనిపించింది. వందలాది కాదు.. వేలాది నౌకలు సూయజ్ కాలువ మార్గాన్ని తప్పించి ఆఫ్రికా చుట్టూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో ప్రయాణ సమయం, ఇంధన వ్యయం, సరుకు రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి.
Houthis chant in celebration on the captured Bab el-Mandeb coast
Many take a break to cool off with a dip https://t.co/yZxW5lL1pn pic.twitter.com/E3GPN3iO0C— RT (@RT_com) September 11, 2026
భారత్‌పై డబుల్ ఎఫెక్ట్?
బాబ్ ఎల్-మండేబ్ సంక్షోభం భారత్‌ను రెండు వైపులా దెబ్బతీసే అవకాశం ఉంది. మొదటిది.. ఇంధన ధరలు. సముద్ర రవాణాకు అంతరాయం ఏర్పడితే చమురు సరఫరాలపై ఒత్తిడి పెరిగి అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు మరింత పెరగొచ్చు. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన మార్కెట్లు ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో ఇది భారత్‌కు భారంగా మారొచ్చు.
రెండోది.. ఎగుమతులు. భారత్ నుంచి యూరప్‌కు వెళ్లే సరుకులు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తే ప్రయాణ దూరం భారీగా పెరుగుతుంది. ఉదాహరణకు ముంబై నుంచి రోటర్‌డామ్‌కు సూయజ్ మార్గంలో దాదాపు 15,700 కిలోమీటర్ల దూరం ఉండగా.. కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ వెళ్లాల్సి వస్తే దాదాపు 23,000 కిలోమీటర్లకు చేరుతుంది. అంటే అదనపు ఇంధనం, ఎక్కువ సమయం, అధిక బీమా, పెరిగిన ఫ్రైట్ ఛార్జీలు భారత ఎగుమతులపై నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే బాబ్ ఎల్-మండేబ్ ఇప్పుడు యెమెన్ తీరంలోని ఓ చిన్న జలసంధి మాత్రమే కాదు.. భారత్ ఇంధన భద్రత, యూరప్ వాణిజ్యం, ప్రపంచ షిప్పింగ్ వ్యవస్థకు కీలక పరీక్షగా మారింది.
ఇదీ చదవండి: బ్రిక్స్ సదస్సుకు దేశాధినేతలు, విశిష్ట అథితులు


