లెబనాన్: గోటి చుట్టు రోకటి పోటులా ఇరాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లాకు కోలుకోలేని బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ఇజ్రాయెల్ చేపట్టిన ‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’ లో తమ అధినేత హాసన్ నస్రల్లాను పోగొట్టుకుని తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆ సంస్థకు.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మరో కోలుకోలేని దెబ్బకొట్టింది. దక్షిణ లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ ఆర్మీ సృష్టించిన భీకర ‘కృత్రిమ భూకంపం’ ధాటికి హెజ్‌బొల్లాకు చెందిన అత్యంత కీలకమైన వ్యూహాత్మక భూగర్భ స్థావరాలు, కమాండ్ సెంటర్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి.
అంతర్జాతీయ కథనాల ప్రకారం.. దక్షిణ లెబనాన్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో ఈ భూప్రకంపనలు నమోదయ్యాయి. అయితే, ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన భూకంపం కాదని, ఇజ్రాయెల్ సైన్యం జరిపిన అత్యంత భారీ భూగర్భ పేలుళ్ల వల్లే ఈ ప్రకంపనలు సంభవించాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వేతో పాటు అంతర్జాతీయ మీడియా సంస్థలు ధృవీకరించాయి.
సరిహద్దుల్లో ఇరాన్ మద్దతు గల హెజ్‌బొల్లా నిర్మించుకున్న భారీ భూగర్భ సొరంగాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం ఈ వినాశకర దాడి చేపట్టింది. అలీ అల్-తాహర్ పర్వత శ్రేణి సమీపంలో ఏకంగా 1,100 టన్నుల (1.1 మిలియన్ కిలోల) అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలను ఉపయోగించి హెజ్‌బొల్లా బంకర్లను ఒకేసారి పేల్చివేశారు.
ఈ భారీ పేలుడు ధాటికి పుట్టిన షాక్‌వేవ్స్ భూమి లోపల 10 కిలోమీటర్ల లోతు వరకు ప్రయాణించడంతో, ఆ తీవ్రతకు సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లాయి. ఇరాన్ ఆర్థిక,సాంకేతిక సాయంతో గత రెండు దశాబ్దాలుగా (20 ఏళ్లుగా) హెజ్‌బొల్లా నిర్మించుకున్న దాదాపు 2 కిలోమీటర్ల పొడవైన అత్యాధునిక అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్ ఈ దాడిలో నాశనమైంది.
ఇది హెజ్‌బొల్లాకు చెందిన అత్యంత కీలకమైన ‘బద్ర్’ప్రాంతీయ విభాగానికి ప్రధాన కమాండ్ సెంటర్‌గా వ్యవహరిస్తోంది. ఇక్కడే భారీగా దాచి ఉంచిన క్షిపణులు, డ్రోన్లు, యాంటీ-ట్యాంక్ ఆయుధాలు, వందలాది ల్యాండ్ మైన్స్ ఈ పేలుడుతో పాటు గాల్లో కలిసిపోయాయి.
భూగర్భంలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పేలుడు సంభవించడంతో ఆ ప్రకంపనలు పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న లెబనాన్ నగరాల వరకు తాకాయి. ముఖ్యంగా దక్షిణ లెబనాన్‌లోని నబాటియా ప్రాంత పరిధిలో ఉన్న భవనాలు తీవ్రంగా ఊగిపోవడంతో, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూగర్భంలో జరిగిన ఈ భారీ విస్ఫోటనం వల్ల స్థానికంగా భూమిపై పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడ్డాయని, పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లిందని రక్షణ నిపుణులు,శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
👉ఇదీ చదవండి : ఇరాన్ పికాక్స్.. ట్రంప్‌కు ఎందుకంత పట్టుదల?


