సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ సందర్భంగా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, ప్యానెల్ స్పీకర్ కడియం శ్రీహరి మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. అక్బరుద్దీన్ వరుసగా 20కి పైగా ప్రశ్నలు అడగడంపై కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో, అక్బరుద్దీన్.. మంత్రులపై సెటైర్లు వేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా..‘క్వశ్చన్ అవర్‌లో ఇన్ని ప్రశ్నలు అడగడం ఏంటి? 20కి పైగా ప్రశ్నలు అడిగితే ఏ మంత్రి ఏ సమాచారాన్ని చెప్పాలి?’ అంటూ కడియం శ్రీహరి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్బరుద్దీన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అనంతరం, అక్బరుద్ధీన్..‘మంత్రులు చాలా గొప్ప గొప్ప చదువులు చదివారు.. వాళ్లు అన్నింటికీ సమాధానం చెబుతారు’ అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. ‘నేను కేవలం 12వ తరగతి పాస్ అయ్యాను.. నేను అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేరా?’ అంటూ సెటైర్ వేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో సభలో ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన సభా నిబంధనలు, అధికార-విపక్షాలకు వర్తించే రూల్స్‌పై ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో కంపెనీలకు కేటాయించిన భూముల వినియోగంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీల పేరుతో భూములు తీసుకుని వాటిని రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న సంస్థలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టాలని కోరారు. కంపెనీలకు భూములు కేటాయించే సమయంలో స్పష్టమైన ఆంక్షలు, నిబంధనలు ఉండాలని సూచించారు.
టెక్ మహీంద్రా వంటి సాఫ్ట్‌వేర్ రంగ దిగ్గజాలు హైదరాబాద్‌కు వస్తున్నప్పటికీ.. ఇక్కడ వ్యాపార అవకాశాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆసక్తి చూపుతున్న కంపెనీలను రాష్ట్రానికి రప్పించి ప్రోత్సహించాలని, తద్వారా పెట్టుబడులు పెరగడంతో పాటు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని చెప్పారు. కంపెనీలకు ఇచ్చిన భూములు కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు కాకుండా.. పరిశ్రమలు, ఐటీ కార్యకలాపాలు, ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడేలా చూడాలని దానం నాగేందర్ సూచించారు. ఈ అంశంపై ఐటీ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించాలని అసెంబ్లీలో కోరారు.
ఇదీ చదవండి: కొండా సురేఖ మాజీ ఓఎస్డీ తండ్రి ఆత్మహత్యాయత్నం


