సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన, అభివృద్ధి ప్రాజెక్టుకు మరోసారి న్యాయపరమైన సవాల్ ఎదురైంది. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ రిటైర్డ్ ఇంజినీర్లు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దక్షిణాది బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
మూసీ ప్రక్షాళన పేరుతో చేపడుతున్న పనులకు పర్యావరణ నిబంధనలు, అనుమతుల విషయంలో లోపాలున్నాయని అప్పీల్‌దారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ వారు ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి న్యాయస్థానం ముందుకు వచ్చింది.
ప్రభుత్వానికి నోటీసులు
అప్పీల్‌ను పరిశీలించిన చెన్నై ఎన్జీటీ బెంచ్.. ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతుల జారీ, ప్రాజెక్టు అమలుకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తన వాదనలను, సంబంధిత వివరాలను ట్రిబ్యునల్ ముందు ఉంచాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే.. మూసీ ప్రాజెక్టుపై గతంలోనూ ఎన్జీటీలో న్యాయపరమైన వివాదం కొనసాగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలైన ఒక పిటిషన్‌ను ఎన్జీటీ కొట్టివేసింది. దీంతో ప్రాజెక్టుకు అప్పట్లో ఊరట లభించింది.
వచ్చే నెల 16న విచారణ
తాజాగా రిటైర్డ్ ఇంజినీర్లు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణను ఎన్జీటీ వచ్చే నెల 16కు వాయిదా వేసింది. దీంతో ఆ రోజు జరిగే విచారణలో పర్యావరణ అనుమతులపై అప్పీల్‌దారులు లేవనెత్తిన అభ్యంతరాలు, రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే వివరణలు కీలకం కానున్నాయి.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నది ప్రక్షాళనతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి, మురుగునీటి సమస్య పరిష్కారం వంటి చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. అయితే ప్రాజెక్టు పర్యావరణ ప్రభావం, అనుమతుల ప్రక్రియపై మొదటి నుంచీ వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఎన్జీటీలో దాఖలైన అప్పీల్‌తో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.


