సాక్షి, చైన్నె: మాదకద్రవ్యాల బారిన పడకుండా యువత తమను తాము కాపాడుకోవాలని, సమాజాన్ని రక్షించే రక్షణ కవచం వలే నిలవాలని చైన్నె నగర పోలీస్ కమిషనర్ అమల్‌రాజ్ పిలుపునిచ్చారు. నగరంలోని ఒక కళాశాలలో జరిగిన మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చైన్నె నగరంలో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 346 మంది ప్రాణాలు కోల్పోయారని, వివిధ ప్రమాదాల కారణంగా 2,421 మంది గాయపడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లపై వృద్ధులు , మహిళలు కూడా ప్రయాణిస్తుండటాన్ని గుర్తుచేస్తూ, వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై కేసులు నమోదైనప్పటికీ, మార్పు రాకపోవడం బాధాకరమన్నారు.
సైబర్ నేరాల ద్వారా భారీ నష్టం
నేటి సమాజాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్యల్లో సైబర్ క్రైమ్ ఒకటని కమిషనర్ పేర్కొన్నారు. సైబర్ మోసాల బారిన పడి నగర ప్రజలు సుమారు రూ. 370 కోట్లు పోగొట్టుకున్నారని, బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
మాదకద్రవ్యాల వ్యసనం ముప్పు
మాదకద్రవ్యాల వినియోగం సమాజాన్ని తీవ్రంగా పీడిస్తోందని తెలిపారు. గత వారంలోనే అతిగా డ్రగ్స్ వాడకం వల్ల యువకులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలను ఆయన గుర్తుచేశారు. నొప్పి నివారణ మందులను సైతం మత్తు కోసం వాడుకోవడం వ్యసనంగా మారుతుందని, ఇది విద్యార్థుల భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తుందని హెచ్చరించారు. విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా భవిష్యత్ తరాలను కాపాడాలని, సమాజంలో ఈ రుగ్మతను రూపుమాపేందుకు అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు 3,500 మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, ‘నేను డ్రగ్స్‌కు వ్యతిరేకం’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. అలాగే విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో, మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించే వీడియో సాంగ్, నాటిక ప్రదర్శించారు. సైబర్ క్రైమ్ మోసాలను వివరించిన మ్యాజిక్ షో అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చైన్నె నగర అదనపు పోలీస్ కమిషనర్ (నార్త్) కపిల్ కుమార్ సి శరత్కర్, వెస్ట్ జోన్ జాయింట్ కమిషనర్ దిశా మిట్టల్, కోయంబడు డిప్యూటీ కమిషనర్ కునాల్ ఉత్తమ్ శ్రోత్తో, కాలేజీ కార్యదర్శి బి చాకో, ప్రిన్సిపల్ ఫ్లోరెన్స్, అధ్యాపకులు సైబర్ సెక్యూరిటీ – యాంటీ–డ్రగ్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


