సాక్షి, చైన్నె : సచివాలయం, అసెంబ్లీ భవన నిర్మాణానికి పట్టినంబాక్కంను వేదికగా ఎంపిక చేయడానికి వ్యతిరేత బయలు దేరింది. పీఎంకే, బీజేపీ, సీపీఐలు వ్యతిరేక నినాదాన్ని అందుకున్నారు. రూ. 1200 కోట్లతో బ్రహ్మాండ భవనంగా సచివాలయం, అసెంబ్లీని పట్టినంబాక్కంలో నిర్మించేందుకు సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక్కడ నిర్మాణాన్ని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి వ్యతిరేకించారు. నగర శివారులో ఫైనాన్స్ సిటీతో పాటుగా పరిపాలనా భవనం నిర్మాణం జరిపే బాగుటుందని సూచించారు. ఇక, బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందిస్తూ,పర్యావరణ ముప్పు, మత్స్యకారుల జీవనోపాధి పై ప్రభావం, తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలను ప్రస్తావిస్తూ ఈ ప్రాజెక్ట్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. అలాగే, బ్రహ్మాండ పార్లమెంట్ భవనానికి రూ. 900 కోట్లు ఖర్చు పెడితే, ఇక్కడ రూ.1200 కోట్లు ప్రకటించడం శోచనీయమన్నారు. సీపీఐ నేత వీర పాండియన్ స్పందిస్తూ, ఇక్కడ నిర్మాణాలు జరిగితే ముళ్లైకుప్పం, శ్రీనివాసపురం, నోచికుప్పం సహా 9 మత్స్యకార గ్రామాల పరిధిలోని 1,500కి పైగా కుటుంబాల చేపల వేట, జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటుందన్నారు. ఈ తీర ప్రాంతం సులభంగా పర్యావరణ నష్టానికి గురయ్యే ప్రాంతం కావడంతోపాటు, ఆలివ్ రిడ్లీ సముద్రపు తాబేళ్లు గుడ్లు పెట్టే ప్రదేశంగా ఉందని, ఈ తరుణంలో ఇక్కడ సచివాలయం నిర్మించడం ప్రమాదకరంగా పేర్కొన్నారు. ఇక, కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ స్పందిస్తూ, సీఎం విజయ్ ప్రభుత్వం ఆగమేఘాలపై దూకుడు ప్రదర్శించడం మానుకుని, సంయమనంతో అడుగులు వేయాలని సూచించారు. పట్టినంబాక్కంలో సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం మానుకోవాలన్నారు. ఇక, జాలర్ల గ్రామాల ప్రజలు, జాలర్ల సంఘాలు పోరు బాటకు సిద్ధమవుతున్నాయి.


