సాక్షి, చైన్నె: ‘‘ఎవరు ఏ విధంగా కించపరిచినా చరిత్రను ఎప్పటికీ మార్చలేరు. అది కాలానికొకలా మారదు, శాశ్వతంగా అలాగే ఉంటుంది’’ అని ఎమర్జెన్సీ కాలంలో మిసా చట్టం కింద తాను అరెస్టయిన విషయాన్ని గుర్తు చేస్తూ డీఎంకే అధ్యక్షులు, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో ద్వారా స్పష్టతనిచ్చారు. తనకు వ్యతిరేకంగా సీఎం విజయ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఆయన తాజాగా స్పందించారు.
మిసా అరెస్ట్ – జైలు చిత్రహింసలు
ఎమర్జెన్సీ కాలంలో, దానికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మెరీనా బీచ్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించి మిసా చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చశారు. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం 30–01–1976 న డీఎంకే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిందని స్టాలిన్ తెలిపారు. ప్రభుత్వాన్ని రద్దు చేసిన వెంటనే తనను మిసా చట్టం కింద అరెస్ట్ చేయడానికి పోలీసులు గోపాలపురం ఇంటికి వచ్చారని, అప్పుడు తాను ఇంట్లో లేనందున, తండ్రి కరుణానిధి ఫోన్ చేసి చెప్పగానే మరుసటి రోజు తానే స్వయంగా పోలీసులకు లొంగిపోయానని తెలిపారు.
తీవ్రమైన దెబ్బలు – గాయాలు:
జైలులో తనను కుష్టు రోగులు ఉంచే ప్రదేశంలో ఉంచారని, 10 మందికి ఒకే గదిని కేటాయించి, అక్కడే ఒకే కుండలో మల మూత్రాలు విసర్జించే దుస్థితి ఉండేదని పేర్కొన్నారు. రాత్రిపూట పోలీసులు లాఠీలతో కొట్టడం, బూట్లతో తొక్కడం వల్ల తనకు దవడ ఎముక పగిలిపోయిందని చెప్పారు. ఇటీవల అసెంబ్లీలో విజయ్ తన దవడను చూపించి మాట్లాడింది వాస్తవమేనని, ఆనాడు తను అనుభవించిన హింస తాలుకూ మచ్చలు నేటికీ తన శరీరంలో ఉన్నాయని స్పష్టం చేశారు.
సార్కారియా కమిషన్ – అవినీతి ఆరోపణలు
సర్కారియా కమిషన్ కరుణానిధిపై చేసిన అవినీతి ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈడీ వంటి సంస్థలను వాడుకుంటున్నారని విమర్శించారు. తమిళనాడు అసెంబ్లీకి ఒక గౌరవం ఉందని, శాసనసభలో శాంతిభద్రతలు, ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర హక్కుల గురించి చర్చించాలే కానీ అనవసరమైన వివాదాలను మాట్లాడకూడదని హితవు పలికారు. సీఎం అయిన తర్వాత తనను కలిసినప్పుడు విజయ్ క్షమాపణ కోరిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో తీవ్రంగా దూషించినందుకే ఈ సారి అన్న సీఎం విజయ్ ఇప్పడు చేస్తున్నదేమిటో..? అని అసమణం వ్యక్తంచేశారు.
ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు:
అసెంబ్లీని రీల్స్ తీసే ప్రదేశంగా మార్చారని, వంతెనలపై నిలబడి ఫోటోషూట్లు చేయడం ద్వారా పరిపాలనను సినిమా షూటింగ్ లాగా మళ్లించారని విమర్శించారు. పరందూరు విమానాశ్రయ ప్రాజెక్టు రద్దు, రైతు రుణమాఫీ అమలు చేయకపోవడం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళా రూ.2500 వంటి హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. చివరగా, ‘‘అధికారంలో ఉన్నా లేకపోయినా, తమిళనాడు హక్కుల కోసం, ప్రజల కోసం మనం ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి. ఇదే డీఎంకే చరిత్ర’’ అని ఎం.కె. స్టాలిన్ ఆ వీడియోలో స్పష్టం చేశారు. కాగా, స్టాలిన్‌వ్యాఖ్యలపై టీవీకే ఐటీ వింగ్‌మరో విధంగాస్పందించింది. 80 ఏళ్లుగా నిర్మించబడిన జైలు అమర వీరుడు అనే బూటకపు ప్రతిబింబం బద్దలవడంతోనే ఈ ఆందోళన తలెత్తినట్టుందని ఎద్దేవా చేశారు. కల్పిత కథనలు, అపోహలతో నిర్మించిన ప్రతిబింబం సత్యం ముందు నిలబడలేదంటూ తాజా వీడి యో నిరూపించినట్టు విమర్శలు గుప్పించారు.


