బైక్‌ ట్యాక్సీ సేవల క్రమబద్ధీకరణకు కమిటీ | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ట్యాక్సీ సేవల క్రమబద్ధీకరణకు కమిటీ

Sep 11 2026 9:40 AM | Updated on Sep 11 2026 9:40 AM

● హైకోర్టుకు ప్రభుత్వ సమాచారం

సాక్షి, చైన్నె : తమిళనాడులో బైక్‌ ట్యాక్సీ సేవలను క్రమబద్ధీకరించేందుకు దక్షిణ మండల రవాణా సంయుక్త కమిషనర్‌ ఆధ్వర్యంలో 6 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు మద్రాస్‌ హైకోర్టు మధురై ధర్మాసనానికి రాష్ట్ర ప్రభత్వుం సమాచారం తెలియజేసింది. మధురైకి చెందిన నవీన్‌కుమార్‌ హైకోర్టు మధురై బెంచ్‌లో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో, తమిళనాడులో డిజిటల్‌ బైక్‌ ట్యాక్సీ సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, అయితే ఈ సేవలను క్రమబద్ధీకరించడానికి నిర్దిష్టమైన ప్రణాళిక లేదని పేర్కొన్నారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో పోలీసులు జరిమానాలు విధించడం, వాహనాలను సీజ్‌ చేయడం, క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ దృష్ట్యా, బైక్‌ ట్యాక్సీలకు లైసెన్సులు మంజూరు చేసి, ఈ సేవలను సక్రమంగా నిర్వహించేందుకు తగిన నిబంధనలను రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన ఆ పిటిషన్‌లో కోరారు.ఈ పిటిషన్‌ న్యాయమూర్తులు సి.వి. కార్తికేయన్‌, ఆర్‌. శక్తివేల్‌ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా రవాణా కమిషనర్‌ దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌లో, బైక్‌ ట్యాక్సీలను క్రమబద్ధీకరించే నిమిత్తం దక్షిణ మండల రవాణా సంయుక్త కమిషనర్‌ సెంధిల్‌ నాథన్‌ నేతృత్వంలో 6 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ అందించే సిఫార్సుల ఆధారంగా బైక్‌ ట్యాక్సీలకు అనుమతులు మంజూరు చేయడంపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని ప్రకటిస్తుందని తెలిపారు. ఇందుకోసం 6 నెలల గడువు కోరడంతో, న్యాయమూర్తులు విచారణను వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement