ముంబై- గోవా హైవే విస్తరణ పనులు నత్త నడకన సాగుతుండటంపై కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల ఆలస్యంపై ఇక ఎంతమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పనుల్లో విపరీతమైన ఆలస్యం జరగడం పట్ల సిగ్గుపడుతున్నానని, అందుకే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తాను హాజరుకాబోవడం లేదని ఆయన కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. గోవాలోని పనాజీ సమీపంలోని పోర్వోరిమ్ వద్ద ఆరు లేన్ల ఎలివేటెడ్ రోడ్డు కారిడార్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు తన హెచ్చరికలను కార్యరూపంలోకి తెచ్చేందుకు, గడ్కరీ అక్టోబర్‌లో ముంబై నుండి గోవా వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించి ఈ హైవే పనుల పూర్తి పొడవును స్వయంగా తనిఖీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆలస్యానికి, నాసిరకం పనులకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. తన శాఖకు ఏడు ప్రపంచ రికార్డులు ఉన్నాయి కానీ ఇపుడు ఒకే సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం, అధికారులను సస్పెండ్ చేయడంలో సరికొత్త రికార్డు సృష్టించాలనుకుంటున్నానంటూ కాంట్రాక్టర్లను హెచ్చరించారు. అదే సమయంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో జాప్యాలకు, నాసిరకం పనులకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని గడ్కరీ తెలిపారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు మహారాష్ట్రలోని తీరప్రాంత కొంకణ్ గుండా వెళుతుంది. భూసేకరణ వివాదాలు, న్యాయపరమైన చిక్కులు, వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం, అటవీ శాఖ అనుమతులు లభించడంలో ఆలస్యం కావడం వంటి అంశాలు పనుల పురోగతిని దెబ్బతీశాయని గడ్కరీ వివరించారు. ప్రస్తుతం అటవీ శాఖ అనుమతుల సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
గడ్కరీ వివరాల ప్రకారం ఈ హైవే పనులు ప్రస్తుతం సుమారు 93-94 శాతం పూర్తయ్యాయి. గణేష్ ఉత్సవాలకు ముందే సుమారు 90-95 శాతం పనులు పూర్తయ్యాయని మహారాష్ట్ర అధికారులు అంచనా వేశారు. అలాగే చిప్లున్ బైపాస్ వర్షాకాలం తర్వాత ప్రారంభమవుతుందని, మంగావ్ బైపాస్ పనులు జనవరి 2027 నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు ఉన్నాయని అంచనా. ఇటీవలి నివేదికల ప్రకారం, ముంబై-గోవా హైవే ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 16,000 కోట్లు ఖర్చు చేశారు.
🚨 Union Minister Nitin Gadkari says he feels “ashamed” over the prolonged delay in widening the Mumbai–Goa Highway.
- He says he will not attend the highway’s inauguration when the project is finally completed and blacklist the contractors pic.twitter.com/5R89KCHuNg— Radio India 🇮🇳 (@Radio_India_) September 10, 2026
కాగా ముంబై-గోవా హైవే విస్తరణ ప్రాజెక్ట్ దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. పాత రెండు లేన్ల హైవేను నాలుగు లేన్లుగా మార్చడం ద్వారా ముంబై - గోవా మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 12 గంటల నుండి ఆరు గంటలకు తగ్గించే లక్ష్యంతో 2011లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ మొదట 2016 నాటికి పూర్తవుతుందని భావించినప్పటికీ, ఇంకా అసంపూర్తిగానే ఉంది.
ఇదీ చదవండి: రూ. 2.5 లక్షల అప్పు, 19 మంది పేర్లు : సివిల్స్ విద్యార్థి ఆత్మహత్య


