జలజీవన్ మిషన్ పనుల బిల్లులు చెల్లించాలని డిమాండ్
మెడలో ప్లకార్డులు ధరించి పవన్ కళ్యాణ్ స్పందించాలని నినాదాలు
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగిన నిరసన
సెప్టెంబర్ 20లోగా బకాయిలుమూడు విడతల్లో ఇస్తామంటూ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమణ
సాక్షి, అమరావతి: గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించి చేసిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు మరోసారి మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారిక నివాసం (జనసేన పార్టీ కార్యాలయం) ఎదుట మంగళవారం ధర్నా చేశారు. జలజీవన్ మిషన్ పనులు బిల్లులు వెంటనే చెల్లించాలి.. పవన్ కళ్యాణ్ స్పందించాలి అంటూ నినాదాలు చేస్తూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆందోళన చేపట్టారు. మెడలో ప్లకార్డుల తగిలించుకొని నిరసన తెలిపారు.
ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లింపు చేయని కారణంగా తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు వాపోయారు. తమకు బిల్లులు చెల్లించడానికి రూ. 620 కోట్లు విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా, జూన్ నెల నుంచి ఇప్పటివరకు కేవలం రూ.170 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్లకు సర్దిచెప్పేందుకు పోలీసులు ప్రయత్నించగా, చెల్లింపులపై స్పష్టత లేకుండా ఇళ్లకు వెళ్లేది లేదని తేల్చిచెప్పారు.
బిల్లులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అయి ఉన్నాయని, కేవలం బటన్ నొక్కితే మా ఖాతాల్లో డబ్బులు పడిపోతాయని దీనిపై పవన్కళ్యాణ్ సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ఆందోళన సాయంత్రం వరకు కొనసాగింది. అనంతరం ఉపముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చర్చలు జరిపారు. చివరకు సెప్టెంబరు 20వ తేదీలోగా మూడు విడతల్లో బిల్లులు చెల్లింపునకు ఉన్నతాధికారులు సుముఖత తెలియజేసినట్టు చెప్పడంతో కాంట్రాక్టర్లు ఆందోళన విరమించారు.


