కేసులు పెడతామని బెదిరించి ఆందోళన భగ్నం
చంద్రబాబు హామీ అమలు చేయాలని ఔట్ సోర్సింగ్ టీచర్ల డిమాండ్
సాక్షి, అమరావతి/ తాడేపల్లి రూరల్: తమ ఉద్యోగాలు రెన్యువల్ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శాంతియుత ఆందోళన చేపట్టిన గిరిజన టీచర్లపై పోలీసులు ప్రతాపం చూపించారు. ఆందోళన విరమించి వెళ్లకపోతే కేసులు పెడతామని బెదిరించి, వారి ఆందోళనను భగ్నం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం గిరిజన టీచర్లు శాంతియుత ఆందోళనకు దిగారు. చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు చేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తమను పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకోవడం పట్ల గిరిజన ఔట్ సోర్సింగ్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజన గురుకులాల్లో 10–15 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చంద్రబాబు, సంధ్యారాణి ఎన్నికల ముందు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అదే హామీని అసెంబ్లీలోను మంత్రి సంధ్యారాణి ప్రస్తావించారని చెప్పారు. ఈ హామీని అమలు చేయకుండా మూడునెలలుగా తమ కుటుంబాలను రోడ్డున పడేశారని చెప్పారు. గతేడాది డీఎస్సీలో తమ పోస్టులు కలపవద్దని కోరినా పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం గురుకులం బైలాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని తమ ఉపాధిని దెబ్బతీసిందని విమర్శించారు.
ఇటీవల 15 రోజులు ఆందోళన చేయడంతో ఆశ్రమ పాఠశాలలు, గిరిజన ప్రైమరీ పాఠశాలల్లో ఖాళీలను భర్తీచేసి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. ఈ మాటలు చెప్పి నెలరోజులు గడుస్తున్నా.. ఔట్ సోర్సింగ్ టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వలేదని యూనియన్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో గిరిజన గురుకుల ఔట్ సోర్సింగ్ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జుననాయక్, నాయకులు పరమేశు, మస్తానుబాబు, రామకృష్ణ, కళ్యాణ్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.


