శాంటియాగో: ప్రపంచంతో అంటార్కిటికా ఖండాన్ని అనుసంధానించేందుకు సముద్రగర్భ ఫైబర్-ఆప్టిక్ కేబుల్ మార్గం సాంకేతికంగా సాధ్యమేనని చిలీ టెలికమ్యూనికేషన్స్ నియంత్రణ సంస్థ (సబ్‌టెల్) నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం అంటార్కిటికాలో భారీ మంచుకొండలు ఉన్నందున ఇంటర్నెట్ కేబుల్స్ లేవు. అక్కడి పరిశోధనా కేంద్రాలు పూర్తిగా ఉపగ్రహాలు, ఓడలు లేదా విమానాల ద్వారా సూట్‌కేసుల్లో తరలించే హార్డ్ డ్రైవ్‌లపైనే ఆధారపడుతున్నాయి. దీనివల్ల బ్యాండ్‌విడ్త్ పరిమితమై, పరిశోధనా కార్యకలాపాలకు మాత్రమే ప్రాధాన్యత లభిస్తోంది.
డ్రేక్ పాసేజ్ మీదుగా సముద్రగర్భ కేబుల్ ఏర్పాటుకు ఈ అధ్యయనం రెండు మార్గాలను ప్రతిపాదించింది
కనిష్ట నిర్మాణం: కింగ్ జార్జ్ ఐలాండ్, ఉత్తర అంటార్కిటిక్ ద్వీపకల్పం పరిసరాల్లోని 3 కేంద్రాలను కలుపుతూ సుమారు 1,600 కిలోమీటర్ల మేర కేబుల్ లింక్ ఏర్పాటు చేయడం.
అనుకూల నిర్మాణం: సుమారు 4,100 కిలోమీటర్ల మేర విస్తరించి, 9 అంటార్కిటిక్ ల్యాండింగ్ పాయింట్లతో చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా, బ్రిటన్ దేశాల పరిశోధనా కేంద్రాలను అనుసంధానించడం.
ఈ వ్యవస్థ ద్వారా ఒక్కో ల్యాండింగ్ పాయింట్‌కు 15 నుంచి 30 టిబిట్/సెకను (Tbit/s) సామర్థ్యంతో రియల్ టైమ్ డేటా ప్రసారం సాధ్యమవుతుంది. సాధారణ కమర్షియల్ కేబుల్స్‌లా కాకుండా, సముద్రపు అడుగుభాగంలో ‘స్మార్ట్’ సెన్సార్లను పొందుపరచనున్నారు.
ఎదురయ్యే సవాళ్లు
ఈ ప్రాజెక్టు ప్రధానంగా రెండు సవాళ్లను ఎదుర్కొంటోంది. మొదటిది డిసెంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో కేవలం మూడు వేసవి కాలాల్లో మాత్రమే పనులు చేపట్టేందుకు తక్కువ సమయం ఉండటం. రెండోది.. మంచుకొండల రాపిడి నుంచి కేబుళ్లను రక్షించడం. ఇందుకోసం హారిజాంటల్ డైరెక్షనల్ డ్రిల్లింగ్, డబుల్-ఆర్మర్డ్ కేబుళ్లను అధ్యయనం సిఫార్సు చేసింది. అయితే, అంతర్జాతీయ అనుమతులు, నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తి కావడానికే దాదాపు ఎనిమిదేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ నివేదికను అంతర్జాతీయ ఆమోదం కోసం చిలీ విదేశాంగ మంత్రిత్వ శాఖ, అంటార్కిటిక్ పాలసీ కౌన్సిల్‌కు సమర్పించారు.
ఇది కూడా చదవండి: ట్రంప్‌కు భారీ ఊరట.. మెయిల్ ఇన్ ఓటింగ్‌పై సంచలన తీర్పు!


