ప్రజలు తమ అనారోగ్య లక్షణాలను స్వయంగా నిర్ధారించుకోవడానికి చాట్‌జీపీటీని ఆశ్రయించే ధోరణి పెరుగుతోందని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అనారోగ్యానికి గురైతే వైద్యుల వద్దకు వెళ్లకుండా ఇంటర్నెట్‌లో లక్షణాలను చూసుకునేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందన్న రాజ్‌నాథ్ సింగ్.. ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం మంచిదే కానీ.. కొన్ని సమయాల్లో ఇది ముప్పుగా మారుతోందంటూ వ్యాఖ్యానించారు.
ఇవాళ(శనివారం) నోయిడాలో మహాజన్ ఇమేజింగ్ అండ్ ల్యాబ్స్ కేంద్రాన్ని రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వైద్యుడిని కలవకముందే తమ లక్షణాలను ఇంటర్నెట్‌లో వెతకడం ఇప్పుడు సాధారణమైందన్నారు. ‘‘ఇప్పుడు చాట్‌జీపీటీ కూడా వచ్చింది. ఏదైనా సమస్య వస్తే మొదట చేసేది ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయడమే.. ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెరగడం మంచిదే అయినప్పటికీ.. ఇది వైద్యులకు కొత్త సవాలుగా మారుతోందంటూ వ్యాఖ్యానించారు.
ఉదాహరణకు ఒక వ్యక్తికి స్వల్పంగా ఛాతి నొప్పి వస్తే, అతను ఇంటర్నెట్‌లో ఆ లక్షణాన్ని వెతికి, తనకు తీవ్రమైన గుండె జబ్బు ఉందని భావించే అవకాశం ఉందన్నారు. కానీ అదే నొప్పి ఆందోళన, ఒత్తిడి, కండరాల సమస్యల వల్ల కూడా రావచ్చని వివరించారు. కొంతమంది రోగులు తమ లక్షణాలను వైద్యుడికి చెప్పడం కంటే, ఇంటర్నెట్‌లో చదివి తాము నిర్ధారించుకున్న వ్యాధి పేరునే వైద్యుడికి చెబుతున్నారని రాజ్‌నాథ్ అన్నారు. వైద్యుడికి లక్షణాలు చెప్పడానికి బదులుగా.. రోగి తన ఇంటర్నెట్ పరిశోధనతో వచ్చి, తనకు ఈ వ్యాధి ఉందని చెబుతున్నాడంటూ రాజ్‌నాథ్ వివరించారు.
ఇదీ చదవండి: సీజేపీ ఎఫెక్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి!
రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగంలో గ్రామీణ ప్రాంతాల రోగులు తమ ఆరోగ్య సమస్యలను స్థానిక భాషలో వివరించే తీరును కూడా సరదాగా ప్రస్తావించారు. గ్రామీణ వ్యక్తి ఛాతిలో ‘ధుక్ ధుక్’ అవుతోందని వైద్యుడికి చెప్పిన ఉదాహరణను ఆయన వివరించారు. వైద్య విద్యలో ‘ధుక్ ధుక్’ అనే వైద్యపరమైన లక్షణం ఉండదని.. రోగి తనకు కలుగుతున్న అనుభూతిని వైద్య పరిభాషలో చెప్పలేకపోవచ్చన్నారు.
అయితే, రోగి చెప్పే ఇలాంటి సాధారణ పదాల వెనుక ఉన్న అసలు లక్షణాన్ని అర్థం చేసుకోవడం వైద్యుడి నైపుణ్యంలో భాగమని ఆయన వ్యాఖ్యలు సూచించాయి. గుండె దడ, గుండె వేగం పెరగడం, ఛాతిలో కొట్టుకున్నట్టుగా అనిపించడం, ఆందోళన లేదా మరేదైనా అసౌకర్యం.. రోగి చెప్పే ఒకే పదానికి అనేక వైద్యపరమైన అర్థాలు ఉండవచ్చు. అందుకే రోగి చెప్పే మాటలను అర్థం చేసుకోవడంతో పాటు అవసరమైన పరీక్షలు, వైద్యపరమైన పరిశీలన కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్నెట్‌లో లక్షణాలు చదివి స్వయంగా వ్యాధి నిర్ధారణ చేసుకోవడం ఎంత విచిత్ర పరిస్థితులకు దారితీస్తుందో చెప్పేందుకు రాజ్‌నాథ్ మరో సరదా సంఘటనను వివరించారు. ఒక రోగి ఇంటర్నెట్‌లో తన లక్షణాలను చదివి తనకు క్లాస్ట్రోఫోబియా(ఇరుకైన ప్రదేశాల్లో చిక్కుకున్నట్లు కలిగే భయం) ఉందని భావించి వైద్యుడి వద్దకు వెళ్లాడట. వైద్యుడు ఎంఆర్‌ఐ స్కాన్ చేయాలని సూచించగానే ఆ వ్యక్తి వెంటనే అంగీకరించాడు. ఒకవేళ అతనికి నిజంగా క్లాస్ట్రోఫోబియా ఉంటే, అతను ఎంఆర్‌ఐ స్కాన్ చేయించుకోవడానికి ఒప్పుకునేవాడు కాదని డాక్టర్ బదులిచ్చారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
ఇదీ చదవండి: ‘అందరికీ షుగర్ ఉందిగా..’.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు


