‘ఆకాశవాణి భవన్’ ప్రాంగణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాం«దీని బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్న పోలీసు సిబ్బంది.. ప్రియాంక అరెస్టు దృశ్యం
ర్యాలీగా మొదలై ధర్నాగా ఉధృతంగా కొనసాగిన విపక్షాల ఆందోళన
పార్లమెంట్ భవనం నుంచి ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరిన విపక్షాల అగ్రనేతలు
మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు
పార్లమెంట్ స్ట్రీట్‌లో బైఠాయించి ధర్నాకు దిగిన విపక్షాల కార్యకర్తలు
బారికేడ్ ఎక్కి త్రివర్ణపతాకం చేబూని నిరసన తెలిపిన రాహుల్‌గాంధీ
ఆకాశవాణి కార్యాలయం లోపలి నుంచి నిర్వాచన్ సదన్‌కు చేరేందుకు విఫలయత్నం
అఖిలేశ్, అభిషేక్, సాగరికా ఘోష్ సహా పలువురు ఎంపీల అరెస్ట్..
ఆలిండియా రేడియో ప్రాంగణంలో 9 గంటలపాటు రాహుల్, ప్రియాంక ఇతర ముఖ్యనేతల ధర్నా
తర్వాత బలవంతంగా అగ్రనేతలందర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు
ఉద్రిక్తంగా మారిన ‘సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా’ డిమాండ్ ఉద్యమం
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) మాటున కోట్ల ఓట్లను రద్దుచేస్తూ ఏకపక్ష నిర్ణయాలు, వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ప్రధాన ఎన్నికల అధికారి(సీఈసీ) జ్ఞానేశ్ తక్షణం పదవికి రాజీనామాచేయాలన్న ఏకైక ప్రధాన డిమాండ్‌తో విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు చేపట్టిన ర్యాలీ హస్తినలో అత్యంత ఉద్రిక్తతలకు దారితీసింది. విపక్ష పార్టీల అగ్రనేతలు పార్లమెంట్ వీధిలో కదంతొక్కారు. మోదీ సర్కార్‌కు లబ్ధిచేకూరుస్తున్న జ్ఞానేశ్ ఇకనైనా గద్దె దిగాలంటూ నేతలు చేసిన నినాదాలతో దేశ రాజధాని హోరెత్తింది.
భారీ సంఖ్యలో విపక్షపార్టీల కార్యకర్తలు సైతం తోడవడంతో అత్యంత సున్నితమైన పార్లమెంట్ పరిసరాలు ఒక్కసారిగా ఉద్రిక్తమయ ఉద్యమవేదికగా మారిపోయింది. పలువురు ముఖ్య నేతలు అరెస్ట్‌లు, తర్వాత విడుదలతో విపక్షాల ర్యాలీ ఆద్యంతం ఉద్రిక్తంగా సాగింది. నూతన ఓటర్లు సమర్పించాల్సిన ఫారమ్6కు అనుబంధంగా ఈసీ తీసుకొచి్చన డిక్లరేషన్‌కు తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదు అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసిన మరుసటి రోజే ‘ఇండియా’ కూటమి పార్టీలు ఢిల్లీ వేదికగా ఉద్యమాన్ని ఉధృతంచేయడం గమనార్హం.
పార్లమెంట్ నుంచి ఆరంభమై..
మంగళవారం ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ ప్రధాన భవనం మకర ద్వారం వద్ద కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, సీపీఐ, సీపీఎం తదితర విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీల లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఒక్కచోటకు చేరి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వాచన్ సదన్’కు ర్యాలీగా బయల్దేరారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డిరెక్ ఒబ్రియాన్, సాగరికా ఘోష్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ ఇలా దాదాపు 300 మంది ఎంపీలు ర్యాలీగా బయల్దేరారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆహార్యంలో ఉన్న జ్ఞానేశ్ కటౌట్‌లను ప్రదర్శిస్తూ ‘ఓటు దొంగలు గద్దె దిగాలి’, ‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం ఆపండి’ అంటూ ఈసీ, కేంద్రప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కూటమిలోలేని బిజూ జనతాదళ్ పార్టీ ఎంపీలు సైతం ర్యాలీలో పాల్గొనడం విశేషం.
మధ్యలోనే అడ్డగింత.. వాగ్వాదం..
నేతలు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్తుండగా పావు కిలోమీటర్ ముందుకెళ్తే ఎలక్షన్ కమిషన్ హెడ్‌ఆఫీస్ వస్తుందనగా నేతలు నీతి ఆయోగ్ కార్యాలయం వద్దకు రాగానే బారికేడ్లు అడ్డంగాపెట్టి వారిని పోలీసులు అడ్డగించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పలువురు నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను నెట్టేసి ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కొందరు నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో రాహుల్ బారికేడ్‌ను ఎక్కేశారు. త్రివర్ణ పతాకం చేతబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు.
తోటి ఎంపీలు సైతం ముక్తకంఠంతో నినదించడంతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. తర్వాత నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ర్యాలీని కొనసాగనివ్వాలని డిమాండ్‌చేశారు. ‘‘జ్ఞానేశ్ జీ ఇప్పటికే ఎన్నికల వ్యవస్థను నాశనంచేశారు. చేసింది చాలు. ఇకనైనా రాజీనామా చేయండి’’ అని ఇదే సమయంలో రాహుల్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు.
నేతలంతా బైఠాయించడంతో ఉద్రిక్తతలను తగ్గించేందుకు పోలీసులు వెంటనే ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఓబ్రియాన్, అభిషేక్ బెనర్జీ, సాగరికా ఘోష్, మహువా మొయిత్రా, కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ సహా పలువురు ఎంపీలను నిర్బంధించి బస్సుల్లోకి ఎక్కించారు. అయితే బస్సులు కొంతదూరం కదిలినా చుట్టూతా కార్యకర్తల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో నేతలను విడిచిపెట్టారు. ఇదే సమయంలో ప్రియాంకాగాంధీ ఎలాగోలా బస్సు నుంచి బయటపడి తిరిగి ధర్నాలో కూర్చున్నారు.
50 మంది ఎంపీలు సహా 250 మంది అరెస్ట్
చెట్టు కింద దాదాపు తొమ్మిది గంటలపాటు కొనసాగిన ధర్నాను రాత్రి వేళ పోలీసులు హఠాత్తుగా భగ్నంచేశారు. ఢిల్లీ పోలీసులు ఒక్కసారిగా పెద్దసంఖ్యలో చుట్టుముట్టి కీలక నేతలందర్నీ లాక్కెళ్లి పోలీస్ వ్యాన్లు, బస్సుల్లోకి ఎక్కించారు. రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, కె.సురేశ్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, చరణ్‌జీత్‌సింగ్ ఛన్నీ, దీపేందర్ హూడా, ప్రణీతి షిండే, వర్షా గైక్వాడ్, ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, మనీశ్ ఛాత్రా తదితర నేతలందరిన్నీ నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న విపక్ష పార్టీల మద్దతుదారుల నుంచి ప్రతిఘటన ఎదురైంది.
50 మంది ఎంపీలుసహా మొత్తంగా 250 మందిని అరెస్ట్‌చేశారు. రాహుల్‌ను కింగ్స్‌వే క్యాంప్ న్యూ పోలీస్‌లైన్స్ స్టేషన్‌కు తరలించారు. ఇతర నేతలను వేర్వేరు వాహనాల్లో అక్కడి నుంచి వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. విడుదలైన ప్రియాంక తర్వాత రాహుల్‌ను నిర్బంధించిన పోలీస్‌స్టేషన్‌కు వచ్చి గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. 2 గంటల నిర్బంధం తర్వాత రాహుల్‌సహా నేతలందర్నీ విడిచిపెట్టారు. నేతల అరెస్ట్‌పై విపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. అయితే ధర్నా నుంచి డీఎంకే, ఆప్ పార్టీలు దూరంగా ఉండిపోయాయి.
అపాయింట్ కోసం లేఖ రాశాకే, సీఈసీని కలిసేందుకే ర్యాలీగా వెళ్లామని ఎంపీలు చెబుతుండగా ముందస్తు అపాయింట్‌మెంట్ కోసం సాయంత్రందాకా ఎలాంటి అభ్యర్థన రాలేదని ఈసీ వర్గాలు స్పష్టంచేశాయి. పార్లమెంట్ అనుబంధ భవనంలో 240 మంది ఎంపీలు తమతో భేటీకి సిద్ధంగా ఉన్నట్లు పోలీసుల నుంచి సమాచారం అందిందని, ఇలాంటి భేటీకి ఈసీ నిబంధనలను ఒప్పుకోవని ఈసీ పేర్కొంది. ముందస్తు అనుమతితో ఈసీ కార్యాలయంలోనే రాజకీయపార్టీల ప్రతినిధులతో ఎలక్షన్ కమిషనర్లు భేటీ అయ్యేందుకే నిబంధనలు అనుమతిస్తాయని ఈసీ ఆ ప్రకటనలో పేర్కొంది. ధర్నాను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కొత్త ‘వీధి నాటకం’గా అభివరి్ణంచారు.
రహదారి నుంచి ఆకాశవాణిలోకి..
ఎంపీలందరినీ పోలీసులు నిర్బంధించే అవకాశం ఉండటంతో రాహుల్, ప్రియాంక, దీపేందర్ హూడా తదితర ఎంపీలు మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో వెంటనే ఎదురుగా ఉన్న ఆకాశవాణి(ఆలిండియా రేడియో కార్యాలయం) ప్రాంగణంలోకి పరుగెత్తారు. మూడో నంబర్ గేటు వద్ద ఉన్న రిసెప్షన్ ఏరియా నుంచి సమీపంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ భవనంలోకి వెళ్లేందుకు ప్రయతి్నంచారు. కానీ అక్కడే ఉన్న పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. అయినాసరే రాహుల్, ప్రియాంక, తదితరులు లోపలికి చొరబడ్డారు.
తర్వాత కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, ప్రణీతి షిండే, చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ, సేవాదళ్ చీఫ్ బీవీ శ్రీనివాస్ తదితరులూ లోపలికొచ్చారు. నాలుగో నంబర్ గేటు సమీప భారీ మర్రిచెట్టు కింద నేతలంతా భైఠాయించి ధర్నా కొనసాగించారు. వెంటనే అక్కడికొచి్చన పోలీసు ఉన్నతాధికారులు నేతలకు ధర్నా విరమించాలని నచ్చజెప్పారు. ధర్నా చేసుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రాంతం చూపిస్తే అక్కడికే వెళ్తామని నేతలు తెగేసిచెప్పారు. ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇక్కడి నుంచే పోరాటం కొనసాగిస్తాం. ఎన్‌డీఏ సర్కార్ ప్రజాస్వామ్యవ్యతిరేక నిర్ణయాలు అమలుచేస్తోంది.
ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భాగవత్, జ్ఞానేశ్ వీళ్లలో ఎవరినీ వదిలిపెట్టేది లేదు. కూటమి ఎంపీలతో ఎన్నికల సంఘం భేటీకి ఒప్పుకునేదాకా మేం వెనక్కితగ్గం’’ అని రాహుల్ మీడియాతో అన్నారు. మధ్యాహ్నం హఠాత్తుగా కాంగ్రెస్ ముఖ్యనేతలంగా లోపలికిరావడంతో ఆలిండియా రేడియో ఉద్యోగులంతా ఒక్కసారిగా ఆశ్చర్యంతో బయటకు పరుగెత్తారు. రాహుల్‌తో సెల్పిలు దిగారు. కొందరు కిటికీల నుంచి తొంగిచూస్తూ, మరికొందరు గోడలెక్కి మరీ నేతల ధర్నాను చూసేందుకు ఎగబడ్డారు. వాళ్లను పోలీసులు వారించారు. ధర్నాచేస్తున్న నేతలు నేలపై కూర్చునేందుకు చాపలు, దుప్పట్లు, ఆరుబయట దోమలు కుట్టకుండా మస్కిటో క్రీమ్‌లు, తినేందుకు చిరుతిండ్లు, తాగడానికి నీరు కార్యకర్తలు ఆగమేఘాల మీద ఏర్పాటు చేశారు.


