14 కోట్ల ఓట్లు తొలగించి ఉంటే ఆధారాలు చూపాలి
నితిన్ నబిన్ యాత్రను లక్ష మందితో సక్సెస్ చేసి చరిత్ర సృష్టిస్తాం
కేంద్ర మంత్రి బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ లక్ష మందితో నిర్వహించనున్న మహా పాదయాత్ర ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణతోపాటు సర్ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెబుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి భారత పౌరుడికి స్థానం ఉండాలని, మరణించినవారి పేర్లు, డూప్లికేట్ ఓట్లను తొలగించడం అవసరమని పేర్కొన్నారు. ఆదివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
‘ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండటం ప్రజాస్వామ్యానికి అత్యంత ముఖ్యం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన నకిలీ ఓట్లను తొలగించడం ఎస్‌ఐఆర్ లక్ష్యం. ఇలాంటి ప్రక్రియను వ్యతిరేకించే వాళ్లంతా దేశ ద్రోహులే. అలాంటి వారు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. విదేశీయులకు ఓటు హక్కు కావాలని కోరడం మూర్ఖత్వం.
14 కోట్ల మంది కాదు కదా.. అర్హులైన 14 లక్షల మంది ఓట్లు తొలగించినట్లయినా సరే ఆధారాలు చూపాలని రాహుల్ గాందీకి సవాల్ విసురుతున్నా. ఆధారాలుంటే కోర్టుకు వెళ్లి న్యాయం పొందవచ్చు. బాధితులను మీడియా ముందు ప్రవేశపెట్టాలి. మరణించినవారి పేర్లు తొలగించకూడదా? డూప్లికేట్ ఓట్లను అలాగే ఉంచాలా?’ అని పేర్కొన్నారు. సీఈసీపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం చర్చకు వస్తే వాస్తవాలను ఆధారాలతో వివరిస్తామని చెప్పారు.
కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ వస్తుంది
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితమవుతుందని, మంత్రుల్లో చాలామంది ఓడిపోతారని బండి సంజయ్ జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉందన్నారు. అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలన విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే పోటీ ఉందని చెప్పారు. బీజేపీ ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉత్తర, దక్షిణ తెలంగాణలో పార్టీని విస్తరిస్తుందన్నారు.


