కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌ | KTR Public Meeting in Hanamkonda | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌

Nov 23 2026 3:43 AM | Updated on Nov 23 2026 3:45 AM

KTR Public Meeting in Hanamkonda

సభలో ప్రసంగిస్తున్న కేటీఆర్‌. చిత్రంలో గౌరు తిరుపతిరెడ్డి, వినయ్‌ భాస్కర్‌

హనుమకొండ జనచైతన్య సభలో కేటీఆర్‌

ఒక్కో మహిళకు రూ.85,500 బాకీ పడ్డారు  

వీటిని మంజూరు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. 

2028లో కేసీఆర్‌ మళ్లీ సీఎం కావడం ఖాయం

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 2028లో కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండలో కేడీసీ కళాశాల ఆవరణలో ఆదివారం రాత్రి నిర్వహించిన జనచైతన్య సభలో కేటీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన అవినీతి, కమీషన్లకు వేదికగా మారిందని ఆరోపించారు. ప్రజాపాలన పేరుతో పర్సంటేజీల పాలన సాగుతోందని విమర్శించారు.

రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెబుతుంటే.. 20 శాతం కమీషన్‌ ఇవ్వనిదే పనులు జరగడం లేదని మరో ఎమ్మెల్యే అనిరు«ద్‌రెడ్డి, గతంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత కూడా ఆరోపించారని గుర్తుచేశారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి వందల కోట్లు డిమాండ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు, దేవాలయ భూముల వ్యవహారంపై కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలు ప్రభుత్వ తీరును స్పష్టం చేస్తున్నాయన్నారు.  

అది ఫ్యూచర్‌ సిటీ కాదు..  
హైదరాబాద్‌ సమీపంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం భూములు సేకరిస్తే, కాంగ్రెస్‌ ప్రభుత్వం పేరు మార్చి ఫ్యూచర్‌ సిటీగా ప్రచారం చేసుకుంటోందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. నిజమైన భవిష్యత్‌ ఉన్న నగరం వరంగల్‌ అని పేర్కొన్నారు. కాళోజీ కళాక్షేత్రంలో కుడా కార్యాలయం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేటీఆర్‌ తప్పుబట్టారు. కవులు, కళాకారుల కోసం నిర్మించిన కళాక్షేత్రాన్ని కార్యాలయంగా మార్చాలనుకోవడం ఏమిటని     ప్రశ్నించారు.

ఇంటర్మీడియట్‌ విద్యా వ్యవస్థను రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై కేటీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి కుటుంబాలకు చెందిన ప్రైవేట్‌ విద్యాసంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు.  

మహిళలకు పెన్షన్లు ఏమయ్యాయి? 
బీఆర్‌ఎస్‌ ఇచ్చిన రూ.2 వేల పెన్షన్‌నే కొనసాగిస్తూ కొత్తగా పెన్షన్లు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారని కేటీఆర్‌ విమర్శించారు. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్‌ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి 36 నెలలు గడిచినా అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ లెక్కన ఒక్కో మహిళకు రూ.85,500 బాకీ పడ్డారన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ముందుగా లక్షాధికారులుగా చేయాలని సవాల్‌ విసిరారు. ఇతర పెండింగ్‌ హామీలతో కలిపి ఒక్కో మహిళకు రూ.1.50 లక్షలు చెల్లించే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఆ మొత్తాన్ని చెల్లిస్తే తాను శాశ్వతంగా రాజకీయాలను వదిలిపెడతానని ప్రకటించారు. 

ఢిల్లీ పెద్దలకు మోకరిల్లుతున్న బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు  
రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ పెద్దల ముందు మోకరిల్లుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌ అందించిన మద్దతును ఎప్పటికీ మర్చిపోలేనని కేటీఆర్‌ అన్నారు.

ఉద్యమ సమయంలో ఓరుగల్లు గడ్డపై నిర్వహించిన కాగడాల ప్రదర్శన, నవంబర్‌ 29న అరెస్టయి వరంగల్‌ సెంట్రల్‌ జైలులో గడిపిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఉద్యమ మహాగర్జన నుంచి తెలంగాణ రజతోత్సవ సభ వరకు వరంగల్‌ ప్రజలు అందించిన అండ మరువలేనిదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఐటీ కంపెనీలు, పరిశ్రమలను తీసుకురావడంలో విఫలమైందని మండిపడ్డారు. 

గౌరు తిరుపతిరెడ్డి చేరిక 
కేటీఆర్‌ సమక్షంలో ఏకశిల విద్యాసంస్థల అధినేత గౌరు తిరుపతిరెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతో పాటు పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కూడా బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement