దిక్కుతోచని స్థితిలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు
15–25 ఏళ్లుగా సేవలు.. అయినా ఉద్యోగ భద్రత కరువు
వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యారంగానికి వెన్నెముకగా నిలుస్తున్న తమకు ఉద్యోగ భద్రత కరువైందని విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 నుంచి 25 ఏళ్లుగా రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా బోధన, పరిశోధన, పరిపాలన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ తమను కాంట్రాక్ట్ విధానంలోనే కొనసాగించడం అన్యాయమంటున్నారు. ఇప్పటికీ తమకు సరైన గుర్తింపు, పనికి తగ్గ వేతనాలు అందడం లేదని 12 వర్సిటీల్లోని 2 వేలకు పైగా కాంట్రాక్ట్ అధ్యాపకులు వాపోతున్నారు. తక్షణమే తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బోధన, పరిశోధనలో కీలక పాత్ర
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లంతా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్దేశించిన విద్యార్హతలు కలిగి ఉన్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు బోధనతోపాటు పరిశోధన ప్రాజెక్టుల రూపకల్పనలో మార్గదర్శకత్వం వహిస్తున్నారు. పలువురు పేటెంట్లు సాధించడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రఖ్యాత జర్నళ్లలో పరిశోధనా పత్రాలు ప్రచురించారు. వాటికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది. పరీక్షల నిర్వహణ, ఇన్విజిలేషన్, ప్రశ్నపత్రాల రూపకల్పన, మోడరేషన్, థియరీ పేపర్ల మూల్యాంకనం, ప్రాక్టికల్ పరీక్షలు వంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు.
ఎన్‌ఎస్‌ఎస్, ఎన్సీసీ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, ప్లేస్‌మెంట్, మూల్యాంకనాలు, పబ్లిక్ రిలేషన్స్ విభాగాల్లోనూ సేవలందిస్తున్నారు. యూజీ, పీజీ పాఠ్యపుస్తకాల రూపకల్పన, రచనలో భాగస్వాములవు తున్నారు. యూజీసీ, ఐసీఎస్‌ఎస్‌ఆర్, డీబీటీ, డీఎస్టీ వంటి సంస్థల పరిశోధనా ప్రాజెక్టుల్లో కో–ప్రాజెక్ట్ డైరెక్టర్లు, కో–ఇన్వెస్టిగేటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇన్‌ఛార్జి హెచ్‌ఓడీలుగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్లు, సభ్యులుగా, డిపార్ట్‌మెంట్ కమిటీలు, పరిశోధనా కమిటీల్లోనూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సమస్యలు పరిష్కరించాకే కొత్త నియామకాలు..
ఇంతటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ తమకు కనీస వేతనాలు కూడా అందడం లేదని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే రకమైన పనిని చేస్తున్నప్పుడు సమాన వేతనం చెల్లించాలన్న సుప్రీంకోర్టు సూత్రాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ఇటీవల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను విశ్వవిద్యాలయ వ్యవస్థలో విలీనం చేయాలని సిఫారసు చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
పంజాబ్, అస్సాం, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను విశ్వవిద్యాలయాల్లో విలీనం చేసి రెగ్యులర్ ఫ్యాకల్టీ హోదా కల్పించిన అంశాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే తరహాలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. రెగ్యులరైజేషన్ లేదా విలీన ప్రక్రియకు మరింత సమయం పట్టే పక్షంలో తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించి, 2016 నుంచి అమల్లో ఉన్న 7వ యూజీసీ పే కమిషన్ వేతనాలను వర్తింపజేయాలని కోరుతున్నారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలను పరిష్కరించిన తర్వాతే కొత్త అధ్యాపక నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


