ఆంధ్రా ప్రాజెక్టులన్నీ బీఆర్‌ఎస్‌ హయాంలోనే.. | Revanth Reddy Targets KCR Over AP Projects: Telangana | Sakshi
Sakshi News home page

ఆంధ్రా ప్రాజెక్టులన్నీ బీఆర్‌ఎస్‌ హయాంలోనే..

Nov 23 2026 12:19 AM | Updated on Nov 23 2026 12:19 AM

Revanth Reddy Targets KCR Over AP Projects: Telangana

పీఏసీ భేటీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో సందీప్, మహేశ్‌గౌడ్, పొంగులేటి, కేకే, మధుయాష్కీ, వంశీచంద్, ఉత్తమ్, సచిన్‌ సావంత్, అంజన్‌కుమార్‌

299 టీఎంసీలకు కేసీఆర్‌ సంతకం చేయడమే కారణం

కాంగ్రెస్‌ వచ్చిన తర్వాత అక్కడ ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేదు

అయినా బీఆర్‌ఎస్‌ మనపై బురదజల్లుతోంది.. ప్రజలకు అన్ని విషయాలూ వివరించాలి

కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రాన్ని రూ.30 వేల కోట్లు అడుగుతున్నాం

కాంగ్రెస్‌ పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తున్న సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నీ బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభమైనవేనని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇటీవలి కాలంలో చర్చ­నీయాంశమవుతున్న పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు కూడా 2022లోనే ప్రారంభించారని, ఈ ప్రాజెక్టు కోసం 2022లోనే కేంద్ర ప్రభుత్వం జలజీవన్‌ మిషన్‌ కింద రూ.1,580 కోట్ల రుణం కూడా మంజూరు చేసిందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ నిర్మించే నీటి ప్రాజెక్టులన్నింటికీ నాడు 299 టీఎంసీల కేటా­యింపుపై కేసీఆర్‌ చేసిన సంతకమే కారణమని, దాని ఆధారంగానే అక్కడ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని విమర్శించా­రు. అయితే, కాంగ్రెస్‌ హయాంలోనే ఆ ప్రాజెక్టులు నిర్మిస్తున్న­ట్టుగా బురద జల్లాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని, అన్ని విష­యాలను ప్రజలకు పార్టీ నాయకత్వం వివరించాలని సూ­చించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం అవసరమైన భూముల సేకరణకు కేసీఆర్‌ హయాంలో నిధులివ్వలేదని, అందుకే మన రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తి కాలేదని విమర్శించారు.

ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహా­రాల, సలహా కమిటీ (పీఏసీ)ల సంయుక్త సమావేశం జరిగింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన బీఎం సందీప్‌తో పాటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ ప్రొఫెష­నల్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు సచిన్‌ సావంత్, జెట్టి కుసుమకుమార్‌లతో పాటు పలువురు మంత్రులు, పీఏసీ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడారు.  

సర్‌ పేరిట కేంద్రం కుట్ర
‘రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా వర్షాలు పడడం లేదు. రైతులు తక్కువ నీటితో పండే పంటలను మాత్రమే సాగుచేయాలి. అయితే విద్యుత్‌కు ఎంత డిమాండ్‌ ఉన్నా సాగు చేసిన పంటలు ఎండిపోకుండా కాపాడాం. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత లేదు. అయితే ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని రానున్న 8 నెలల పాటు ప్రజలకు తాగునీరు అందించేందుకే వినియోగించాల్సి ఉంది. కరువు పరిస్థితులను అధిగమించేందుకే కేంద్రం నుంచి రూ.30 వేల కోట్ల సాయం కోరుతున్నాం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ పని కల్పించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాం. 

బూత్‌స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి..
ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో అర్హులైన ఓట్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ దేశంలోని ప్రజలందరికీ ఓటు హక్కు కల్పిస్తే, బీజేపీ ఓట్లు తీసేస్తోంది. దేశాన్ని ఓటు హక్కు ఉన్న వారు, లేని వారిగా విడగొడుతోంది. యాంత్రికంగా ఓట్లను తొలగించడం ద్వారా ద్వితీయ శ్రేణి పౌరులను తయారు చేస్తోంది. ఎస్‌ఐఆర్‌ విషయంలో పార్టీ బూత్‌స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. అధిష్టానం ఆదేశాలను నేను తూచా తప్పకుండా పాటిస్తా.

ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ఎన్టీఆర్, వైఎస్సార్‌ హయాంలో ప్రారంభమైన కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నాం. ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వానిదే. మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దాం..’ అని రేవంత్‌ పిలుపునిచ్చారు. పార్టీ కొత్త ఇన్‌చార్జి సందీప్‌కు స్వాగతం పలికిన ఆయన..అంతకుముందు ఇన్‌చార్జిగా పనిచేసిన మీనాక్షి నటరాజన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

‘ఇందిరమ్మ సూక్తులు’ పుస్తకావిష్కరణ
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రచురించిన ‘ఇందిరమ్మ సూ­క్తు­లు’ అనే పుస్తకాన్ని ఆదివారం గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌ ఆవిష్కరించారు. ఇంగ్లీషులో వచ్చిన ఇందిర సూక్తులను డాక్టర్‌ పొన్నం రవిచంద్ర, డాక్టర్‌ మామిడి హరికృష్ణ, శ్రీలక్ష్మి­లు అనువదించారు. ఈ కార్యక్రమంలో బీఎం సందీప్, మహేశ్‌­గౌడ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement