ఖమ్మం అబ్బాయి.. యూకే అమ్మాయి.. ప్రేమకు దేశాల సరిహద్దులు అడ్డుకాలేదు. భాషలు, సంస్కృతులు వేరైనా మనసులు కలిశాయి. పరిచయం ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లి బంధానికి ముడిపడనుంది. ఎల్లలు దాటిన ఈ ప్రేమకథకు నేడు ఖమ్మంలో హిందూ సంప్రదాయంలో ఏడడుగుల సాక్షిగా కల్యాణ ఘడియలు మొదలయ్యాయి. ఏడు సముద్రాల అవతల పుట్టి, ఖమ్మం కోడలిగా రాబోతున్న వధువు ఎలిజబెత్, వరుడు భరత్‌లపై ఆదివారం ప్రత్యేక కథనం..
కలిపిన ఉద్యోగం..
ఖమ్మం కుర్రాడు, యూ.కే. అమ్మాయి ఇద్దరు మనసులు ఒక్కటయ్యే వేడుకకు ఖమ్మం వేదికైంది. ఖమ్మం నగరం ముస్తఫానగర్‌కు చెందిన సగ్గుర్తి లక్ష్మణ్ – రోజా దంపతుల ఏకైక కుమారుడు భరత్ ఖమ్మంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి యునైటెడ్ కింగ్ డమ్(యూకే)లో 2021లో ఎంఎస్ పూర్తి చేసి పెన్షన్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఆ దేశానికి చెందిన ఎడ్మిన్ ఆర్మ్‌స్ట్రాంగ్ – హేజల్ గ్రేలీ దంపతుల రెండో కుమార్తె ఎలిజబెత్ డిగ్రీ పూర్తి చేసి అదే విభాగంలో ఉద్యోగం చేస్తోంది.
ఈక్రమాన 2024లో వారి మనసులు కలవగా కొద్ది రోజుల తర్వాత ఎలిజబెత్ తన హోం టౌన్‌కు బదిలీ కాగా ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఆతర్వాత విషయాన్ని వారిరువురి తల్లిదండ్రులకు తెలియజేయగా వారు పెళ్లికి అంగీకరించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం(22న) ఖమ్మంలో వివాహం జరపాలని నిర్ణయించి ఎలిజబెత్ కుటుంబీకులు ఖమ్మానికి చేరుకున్నారు. దీంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.


