నల్లగొండ జిల్లా: ఉన్నత చదువులు చదివి ఎన్నో ఆశలతో కష్టపడి సాధించిన ఉద్యోగంతో జీవితం కొత్త మలుపు తిరుగుతుందనుకున్న సమయంలో విధి వక్రీకరించింది. అమెరికాలో ఉద్యోగం సాధించిన వారం రోజులకే ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఆలస్యంగా తెలిసిన ఈ ఘటన వివరాలిలా..నల్లగొండ జిల్లా మునుగోడు పట్టణానికి చెందిన ఈరమల్ల ప్రసాద్, శ్రీకన్య దంపతులకు ఇద్దరు కుమారులు.
పెద్ద కుమారుడు ఈరమల్ల సాయితేజ(25) రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసి, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ ఉన్నత విద్య పూర్తి చేసి వారం రోజుల క్రితమే ఉద్యోగం సాధించాడు. ఇంతలోనే బుధవారం(18వ తేదీ) సాయంత్రం న్యూయార్క్‌లోని ఇంటర్ స్టేట్ 90 హైవేపై తన స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా రోడ్డుకు అడ్డంగా వచ్చిన జింకను ఢీకొట్టడంతో కారు ఆగిపోయింది. ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న కార్గో వ్యాన్ కారును బలంగా ఢీకొట్టగా, ఆ ధాటికి కారు మరో రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయితేజతో పాటు అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా సాయితేజ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తికి చికిత్స కొనసాగుతున్నట్లు తెలిసింది. సాయితేజ మృతదేహానికి నల్లగొండలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. మృతదేహాన్ని నల్లగొండకు తరలించేందుకు అమెరికాలోని తెలుగు సంఘాల సభ్యులు, అతడి స్నేహితులు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం వరకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని బంధువులు తెలిపారు. సాయితేజ అమెరికాలో మృతిచెందడం చాలా బాధాకరమైన విషయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.


