ల్యాబ్‌లో పెంచిన కంటి కణాలతో చూపు! | Scientists Explore Vision Restoration Using Lab-Grown Eye Cells | Sakshi
Sakshi News home page

ల్యాబ్‌లో పెంచిన కంటి కణాలతో చూపు!

Nov 22 2026 5:40 AM | Updated on Nov 22 2026 5:40 AM

Scientists Explore Vision Restoration Using Lab-Grown Eye Cells

ప్రయోగశాలలో పెంచిన కంటి కణాలను శస్త్రచికిత్స ద్వారా రెటీనా కింద అమర్చడంతో ఇద్దరు బాధితులకు మళ్లీ చూపు మెరుగుపడింది. లండన్‌లోని మూర్‌ఫీల్డ్స్‌ కంటి ఆసుపత్రి, యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు ఈ చికిత్సను చేపట్టారు. కంటిలోని రెటీనా వెనుక భాగంలో ఉండే కణాల పొరను రెటినల్‌ పిగ్మెంట్‌ ఎపిథీలియమ్‌ (ఆర్‌పీఈ) అంటారు. ఇది కంటికి వెలుతురును గుర్తించే కణాలకు అవసరమైన పోషకాలను అందిస్తూ వాటి పనితీరుకు తోడ్పడుతుంది.

ఆర్‌పీఈ కణాలను మానవ పిండం తాలూకు మూలకణాల నుంచి సేకరించి ప్రయోగశాలలో పెంచారు. ఆ తర్వాత వాటిని చాలా పలుచని కృత్రిమ పొరపై అమర్చారు. ఇలా తయారైన కణాల పొరను ఇద్దరు రోగుల కళ్లలో రెటీనా కింద శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. వారిలో ఒకరు 60 ఏళ్ల వయసున్న మహిళ కాగా, మరొకరు 80 ఏళ్ల వయసున్న పురుషుడు. వారిద్దరూ తీవ్రమైన వెట్‌ ఏజ్‌ రిలేటెడ్‌ మాక్యులార్‌ డీజనరేషన్‌ సమస్య కారణంగా అకస్మాత్తుగా చూపులో ఎక్కువ భాగాన్ని కోల్పోయారు.

చికిత్స జరిగిన ఏడాది తర్వాత ఇద్దరి చూపులో గణనీయమైన మెరుగుదల కనిపించింది. అంతకుముందు కళ్లద్దాలు పెట్టుకున్నా చదవలేని స్థితిలో ఉన్న వారు.. చికిత్స తర్వాత సాధారణ రీడింగ్‌ గ్లాసెస్‌ సాయంతో నిమిషానికి 60 నుంచి 80 పదాలు చదవగలిగారు. భవిష్యత్తులో స్టెమ్‌ సెల్‌ ఆధారిత కంటి చికిత్సల పరిశోధనలకు ఇది ఒక మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రముఖ వైద్య పరిశోధన జర్నల్‌ ‘నేచర్‌ బయోటెక్నాలజీ’లో ప్రచురితమయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement