అంతర్జాతీయ న్యాయవిద్యా సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. చిత్రంలో జస్టిస్ పి.శామ్ కోషి, భారత అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, జస్టిస్ ఈవీ వేణుగోపాల్, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, బంగ్లాదేశ్ జాతీయ మానవహక్కుల కమిషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ మీజానుర్ రెహ్మన్
ఆ సమాచారం కచ్చితమైనదని భావించరాదు: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
ఏఐ వినియోగంపై మార్గదర్శకాలు అవసరం
క్లయింట్ల వ్యక్తిగత, రహస్య సమాచార అప్‌లోడ్ వద్దు
కృత్రిమమేధతో జడ్జి మెదడును చదివే చిప్ వస్తుందేమోనని సీజేఐ వ్యాఖ్య
ఏఐతో సానుకూల, ప్రతికూల ప్రభావాలు ఉన్నాయన్న జస్టిస్ పీఎస్ నరసింహ
సీఎల్‌ఈఏ సదస్సులో పలువరు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్య అంతిమ లక్ష్యం సమాజంలోని ప్రతి ఒక్కరికీ న్యాయం అందేలా చూడటమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న కార్మీకులు, పింఛన్ నిలిచిపోయిన వితంతువులు, న్యాయపరమైన పత్రాలు పొందలేని వృద్ధులు, గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలకు న్యాయ సాయం అందించడంలో లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, న్యాయ విద్యార్థులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలు, పేదల నివాస ప్రాంతాలకు వెళ్లి న్యాయ సహాయం అందించాలన్నారు. కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (సీఎల్‌ఈఏ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న వార్షిక అంతర్జాతీయ న్యాయ విద్యా సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ... కామన్వెల్త్ అనే పదం అందరి సంక్షేమాన్ని సూచిస్తుందని, ఒకరి శ్రేయస్సును మరొకరి నుంచి వేరుచేయలేమని చెప్పారు.
న్యాయ పరిశోధనలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగానికి విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. జడ్జీల లిప్ రీడింగ్ తెలుసుకోవడంతోపాటు మెదడు కూడా చదివే చిప్ రావొచ్చేమోనని అభిప్రాయపడ్డారు. పరిశోధనకు అవసరమైన సమాచారాన్ని సేకరించడం, క్రమబద్ధికరించడంలో ఏఐ సాధనాలు ఉపయోగపడతాయని, అయితే వాటి ద్వారా లభించిన సమాచారం కచ్చితమైనదని భావించి గుడ్డిగా స్వీకరించరాదన్నారు. క్లయింట్ల వ్యక్తిగత వివరాలు, రహస్య సమాచారాన్ని సంబంధిత వ్యక్తుల అనుమతి, గోప్యత, భద్రత అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా బాహ్య ఏఐ వ్యవస్థల్లో అప్‌లోడ్ చేయరాదని హెచ్చరించారు.
ఏఐ ప్రభావంపై పునరాలోచన: జస్టిస్ పీఎస్ నరసింహ
న్యాయ విద్యలో ప్రపంచీకరణకు అనుగుణంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ అన్నారు. న్యాయ కళాశాలలను న్యాయపరమైన అంశాలను బోధించే విద్యాసంస్థలుగానే కాకుండా, సమకాలీన సమాజ అవసరాలకు అనుగుణంగా న్యాయ పరిజ్ఞానాన్ని అందించే కేంద్రాలుగా పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. ఏఐ ప్రభావం సమాచారాన్ని సులభంగా పొందడానికే పరిమితం కావడం లేదని, మనిషి ఆలోచించే, తర్కించే, విశ్లేషించే విధానాలపైనా ప్రభావం చూపుతోందన్నారు.
ఈ పరిణామాల్లో సానుకూల, ప్రతికూల అంశాలు రెండూ ఉన్నాయని పేర్కొన్నారు. న్యాయ విశ్వవిద్యాలయాలు ఇప్పటికే బోధనలో ఏఐని వినియోగిస్తున్నాయని, అనుకరణ శిక్షణ, వాస్తవ పరిస్థితులను పోలిన సమస్యల రూపకల్పన వంటి అంశాల్లోనూ దాని ఉపయోగం పెరుగుతోందని చెప్పారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని న్యాయ విద్యాసంస్థలు అర్థం చేసుకుని, విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన, విశ్లేషణ సామర్థ్యాలను పెంపొందించే విధంగా బోధనా పద్ధతులను రూపొందించాలని సూచించారు.
న్యాయ విద్యలో సమూల మార్పులు: జస్టిస్ శామ్ కోషి
మారుతున్న ప్రపంచ పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ నేపథ్యంలో న్యాయ విద్యలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్ కోషి అభిప్రాయపడ్డారు. న్యాయ విద్యార్థులకు చట్టాలు, తీర్పులు, న్యాయ సూత్రాలపై అవగాహన కల్పించడమే కాకుండా.. భవిష్యత్తులో న్యాయ రంగం ఎదుర్కొనే సవాళ్లను అధిగమించే సామర్థ్యాన్ని పెంపొందించాలని సూచించారు. న్యాయవాదులు ఒక దేశ చట్టాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ న్యాయ పరిణామాలపైనా అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. న్యాయ విద్యలో చట్టాలు, న్యాయస్థానాల తీర్పులు, న్యాయ సూత్రాల అధ్యయనం అత్యంత అవసరమైనప్పటికీ అవి మాత్రమే సరిపోవన్నారు.
ఏఐ.. మనస్సాక్షికి ప్రత్యామ్నాయం కాలేదు: జస్టిస్ ఈవీ వేణుగోపాల్
న్యాయ విద్యలో సంస్కరణలు తీసుకురావడంతోపాటు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో న్యాయ విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ అన్నారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడం, వారిని ప్రోత్సహించడం, న్యాయ విద్య సిలబస్‌లో అవసరమైన మార్పులు తీసుకురావడం ద్వారా> భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి న్యాయవాదులుగా ఎదిగే అవకాశాలు కల్పించవచ్చన్నారు.
న్యాయ విద్యలో పురోగతికి హైదరాబాద్ ప్రారంభ వేదికగా నిలవాలని, ఈ రంగంలో నగరం నాయకత్వం వహించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ‘న్యాయవాద వృత్తిలో క్లయింట్‌ను కోల్పోవచ్చు కానీ కోర్టును కోల్పోకూడదు. కోర్టులో ఓడిపోవచ్చు కానీ మనస్సాక్షిని, వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకూడదు’ అని తన గురువు రామ్ జెఠ్మలానీ చెప్పిన మాటలను ప్రస్తావించారు.
ఉమ్మడి న్యాయ నివేదికలు రావాలి: ఏజీ
కామన్వెల్త్ దేశాల మధ్య న్యాయ విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంతోపాటు, వివిధ దేశాల రాజ్యాంగ న్యాయ తీర్పులకు సంబంధించి ఉమ్మడి న్యాయ నివేదికల వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఏ.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి న్యాయ విద్య అండర్ గ్రాడ్యుయేట్ పాఠ్యప్రణాళికలో పది కొత్త సబ్జెక్టులను చేర్చుతోందని వెల్లడించారు. వాటిలో సైబర్ చట్టాలు, సైబర్ భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు–న్యాయశాస్త్రం వంటి అంశాలు ఉన్నాయని తెలిపారు.
ఆర్ అండ్ డీ కేంద్రాలుగా...
న్యాయ విద్య కేవలం చట్టంలోని వివిధ అంశాలపై పరిజ్ఞానం సంపాదించడానికి, న్యాయస్థానాల్లో వాదనలు వినిపించడానికి మాత్రమే పరిమితం కాకూడదని భారత అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి చెప్పారు. న్యాయ కళాశాలలను నిజమైన పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా న్యాయవాద వృత్తి పరిధి విస్తరిస్తున్న నేపథ్యంలో, న్యాయ విద్య సిలబస్ కూడా మారాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సూచించారు.
కోర్టులో న్యాయమూర్తుల మధ్య జరిగే చర్చ తెలిస్తే మరింత సమర్థవంతంగా సహకారం అందించవచ్చని సరదాగా వ్యాఖ్యానించారు. న్యాయ విద్యార్థులకు లిప్‌రీడింగ్‌ను కూడా పాఠ్యాంశంగా ప్రవేశపెడితే ఎలా ఉంటుందని సరదాగా ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు జడ్జీలు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అహ్మద్ నవాజ్, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ లీసాగిల్, పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, సీఎల్‌ఈఏ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.శివకుమార్, ఏఎస్‌జీ నరసింహశర్మ, డీఎస్‌జీ భుజంగరావు, అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌లు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, వివిధ న్యాయవిద్యా సంస్థల ఉపకులపతులు, డీన్లు, ప్రొఫెసర్లు, సీనియర్ న్యాయవాదులు, న్యాయరంగ ప్రముఖులు పాల్గొన్నారు.


