హైదరాబాద్: జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్‌భానుచిబ్, ఇన్‌చార్జి మణిశర్మల సోషల్ మీడియా ఖాతాల నిలిపివేతకు నిరసనగా శుక్రవారం హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని ‘మెటా’ కార్యాలయాన్ని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ముట్టడించారు. కార్యాలయం ముందు పూల కుండీలను పగులగొట్టి, ప్లకార్డులతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, మెటాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సోషల్ మీడియా వేదికలను రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని, నిషేధించిన ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని శివచరణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిరసన సందర్భంగా పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం శివచరణ్‌రెడ్డి సహా 21 మందిని రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.


