సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమాల ఆన్‌లైన్ పైరసీ వ్యవహారంపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రణబాలి, కల్ట్, ఆదర్శ కుటుంబం సినిమాలను దుండగులు కర్నూలులోని సిటీ స్క్వేర్ మాల్ సినిమా థియేటర్‌లో రహస్యంగా చిత్రీకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు.
అలాగే నవంబర్ 20న విడుదలైన ‘ఆకాశంలో ఒక తార’మూవీ కూడా గంటల్లోనే వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైంది. ఈ నాలుగు సినిమాల పైరసీపై తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రాజెక్ట్ హెడ్ యర్రా మణీంద్రబాబు శుక్రవారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీ సీఎస్‌బీ)లో ఫిర్యాదు చేశారు. ఒక వెబ్‌సైట్‌లో పైరసీ కాపీలను గుర్తించినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


