53వ సీజేఐగా ఆయనే!
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ ఎంపిక కానున్నారు. సూర్యకాంత్ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్(BR Gavai) కేంద్రానికి ప్రతిపాదన పంపారు. అన్నీ సక్రమంగా జరిగితే నవంబర్ 24వ తేదీన జస్టిస్ సూర్య కాంత్ భారత దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.52వ ప్రధాన న్యాయమూర్తి అయిన బీఆర్ గవాయ్ పదవీ కాలం నవంబర్ 23తో ముగియనుంది. జస్టిస్ సూర్యకాంత్ గతంలో పంజాబ్-హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. సుప్రీంకోర్టులో ఆయన అనేక కీలక తీర్పులు ఇచ్చారు, ముఖ్యంగా వన్ ర్యాంక్-వన్ పెన్షన్ (OROP) పథకాన్ని రాజ్యాంగబద్ధంగా సమర్థిస్తూ ఇచ్చిన తీర్పు తీవ్ర చర్చనీయాంశమైంది.సూర్యకాంత్.. 1962 ఫిబ్రవరి 10వ తేదీన జన్మించారు. హర్యానాలోని కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1984లో న్యాయవాదిగా హర్యానా & పంజాబ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2004లో హైకోర్టు న్యాయమూర్తిగా.. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు.. NALSA (National Legal Services Authority) కార్యనిర్వాహక ఛైర్మన్గా ఇటీవల ఈయన నియమితులయ్యారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నందున.. ప్రస్తుత CJI జస్టిస్ బీఆర్ గవాయి పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. సీజేఐగా సూర్యకాంత్ పదవీ కాలం 2027 ఫిబ్రవరి 9వ తేదీతో ముగియనుంది.