సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్య
కటక్(ఒడిశా): నూతన సాంకేతికత అనేది న్యాయస్థానాల తీర్పును మరింత మెరుగుపర్చాలిగానీ తీర్పును అధిగమించేదిగా ఉండకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఒడిశాలోని కటక్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. పెండింగ్ కేసుల భారం దిగువ కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు న్యాయ వ్యవస్థలోని ప్రతి స్థాయిలోనూ ఇబ్బందులను సృష్టిస్తున్నాయన్నారు. పైస్థాయిలో తలెత్తిన అడ్డంకులు దిగువ స్థాయిపై ఒత్తిడిని మరింతగా పెంచుతున్నాయని చెప్పారు.
పెండింగ్ సమస్యను అధిగమించేందుకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని సీజేఐ తెలిపారు. అవసరానికి తగినన్ని న్యాయస్థానాలు లేకుంటే, ఎంత చిత్తశుద్ధి కలిగిన న్యాయవ్యవస్థ అయినా కుప్పకూలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికతతో ఎన్నో సౌలభ్యాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ దు్రష్పభావాలు కూడా ఉన్న విషయం మరువరాదన్నారు. నేటి డీప్ ఫేక్‌లు, డిజిటల్ అరెస్ట్‌ల కాలంలో న్యాయస్థానాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పేదలు, వృద్ధులను పట్టించుకోని సంస్కరణ అస్సలు సంస్కరణే కాదు, అది తిరోగమనం కూడా అని తెలిపారు.


