న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం నానాటికీ దిగజారుతోంది. దాంతో పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఔట్ డోర్ క్రీడలన్నింటినీ తక్షణం రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని, నగర డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ)ని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) ఆదేశించింది. లేదంటే పిల్లలు తీవ్ర అనారోగ్య బారి వాడటం ఖాయమని హెచ్చరించింది. ఢిల్లీతో పాటు హరియాణా, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలకు కూడా ఈ మేరకు కమిషన్ లేఖలు రాసింది. ‘ఆరుబయట ఆడే క్రీడలన్నింటినీ రద్దు చేయాలంటూ నవంబర్ 19నే మేం లేఖలు రాశాం.
కానీ కొన్ని స్కూళ్లు, విద్యా సంస్థలు ఇంకా వాటిని కొనసాగిస్తున్నాయి‘ అంటూ ఆక్షేపించింది. ‘రోడ్లపై విపరీతమైన దుమ్ము పేరుకొని ఉంది. ఒకవైపు తీవ్ర కాలుష్యంతో సతమతమవుతూ ఉంటే వాటి నిర్వహణ ఇంత అధ్వానంగానా? సగానికి సగం రోడ్లపై మున్సిపాలిటీ వ్యాన్లు సేకరించిన చెత్త పడి ఉంది’ అంటూ నాలుగు పెట్టింది. శనివారం నుంచి ఢిల్లీ, ఎన్ సీఆర్ పరిధిలో అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను సీఏక్యూఎం నిషేధించడం తెలిసిందే. అలాగే ట్రక్కులకు నగరంలోకి ప్రవేశాలు నిలిపేశారు. ఢిల్లీలో డీజిల్ వాహనాల రాకపోకలను నిషేధించారు. చలికాలంలో ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోతూ ఉంటుంది.
కర్టెన్లు చాలు: రామ్ దేవ్
ఢిల్లీ కాలుష్యానికి ఎయిర్ ప్యూరిఫయర్ల వాడకం పరిష్కారం కాదని యోగ గురు బాబా రామ్ దేవ్ అన్నారు. పైగా అది సంపన్నుల ఆడంబరం అంటూ ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీ కొన్నిసార్లు గ్యాస్ చాంబర్‌ను తలపిస్తుంది. అంతమాత్రాన ఆందోళన పడాల్సిన పనిలేదు. డోర్ కర్టెన్లు వేసుకుంటే చాలు. వాటిని 20 రోజులకు ఒకసారి మూతికి మాస్క్ పెట్టుకొని దులుపుకుంటే సరిపోతుంది. దీనితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం కూడా అలవాటు చేసుకోవాలి’ అని ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో సూచించారు. ఇంత కాలుష్యంలో వ్యాయామమా అని ప్రశ్నించగా, కపాలభాతి వంటి శ్వాస వ్యాయామాలు చేయాలన్నారు.


