మంటలు రేపిన మెస్సీ నిష్కృమణ
స్టేడియంలో అభిమానుల విధ్వంసం
కార్పెట్, కుండీలు చోరీ
ఫుట్‌బాల్ దేవుడు లియోనెల్ మెస్సీని కళ్లారా చూసేందుకు కోల్‌కతాలో అభిమానుల సాహసాలు, పడిన ఆరాటం అంతా ఇంతా కాదు. కొందరు వేలకు వేలు చెల్లించగా, ఓ అభిమాని ఏకంగా తన పెళ్లి వేడుకలను పక్కనపెట్టి స్టేడియానికి వచ్చాడు. కానీ, అంతిమంగా వారందరికీ మిగిలింది తీవ్ర నిరాశే. ’గోట్ టూర్ 2025’లో భాగంగా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ అడుగుపెట్టినప్పటికీ, ఆయన ముందుగానే నిష్క్రమించడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ అస్తవ్యస్థ, పేలవమైన నిర్వహణతో వేలాది మంది అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
మెస్సీ కనిపించలేదు.. కార్పెట్ తీసుకుపోతున్నా!
మెస్సీని దగ్గరగా చూడాలని రూ.10,000 చెల్లించిన ఓ అభిమాని, తీవ్ర నిరాశతో.. ఆవేశంతో ఊగిపోయాడు. స్టేడియం లోపలికి చొచ్చుకొచ్చి.. ఏకంగా మైదానంలోని గడ్డి కార్పెట్‌ను చుట్టి, మోసుకుపోతూ కనిపించాడు. ‘మెస్సీ ముఖం కూడా కనిపించలేదు. చాలా డబ్బు పోయింది, అందుకే ఈ కార్పెట్‌ను ఇంటికి తీసుకెళ్లి ప్రాక్టీస్ చేస్తా!’.. అని ఆగ్రహం, వ్యంగ్యం మిళితమైన స్వరంతో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. నెటిజన్లు అతన్ని ’అత్యంత ప్రాక్టికల్ అభిమాని’గా అభివరి్ణంచారు. మెస్సీ కంటే ఎక్కువ సేపు స్టేడియంలో ఆ కార్పెట్ మాత్రమే ఉందంటూ మీమ్స్ వెల్లువెత్తాయి.
కుండీలు మోసుకెళ్లిన మరో అభిమాని
కార్పెట్ దొంగతనం జరిగిన కొద్దిసేపటికే, మెస్సీ జెర్సీ ధరించిన మరో వ్యక్తి సైతం మైదానం నుంచి రెండు పూలకుండీలను మోసుకెళ్తూ కనిపించాడు. పూలకుండీలను ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా.. ‘వీటి ని మా ఆవిడకు ప్రేమగా బహుమతిగా ఇస్తాను’.. అని ఆ వ్యక్తి చెప్పాడు. అభిమానులు అందినకాడికి స్టేడియంలోని వస్తువులను దోచుకుపోయారు. మొత్తం మీద, మెస్సీని చూడాలనే ఆశ నెరవేరక, సోఫాలు పీకివేయడం, సీట్లు ధ్వంసం చేయడం, బాటిళ్లు విసరడం వరకు విధ్వంసం కొనసాగింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


