మెస్సీకి హైదరాబాదీ రుచులు
101 మంది కూర్చొనే నిజాం డైనింగ్ టేబుల్‌ను చూసి మెస్సీ ఫిదా
సాక్షి, హైదరాబాద్: ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ మన హైదరాబాదీ వంటకాల రుచి చూశారు. హైదరాబాదీ బిర్యానీ, హలీమ్‌కు ఫిదా అయ్యారు. భారత దేశ పర్యటనలో భాగంగా శనివారం భాగ్యనగరానికి వచ్చిన మెస్సీ.. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బస చేశారు. కుటుంబంతో కలిసి వచ్చిన ఆయన ప్యాలెస్‌లోని నిజాం లగ్జరీ సూట్‌లో గడిపారు. ఉప్పల్‌లో ఫ్రెండ్లీ మ్యాచ్ అనంతరం రాత్రి విందులో ఆయన హైదరాబాదీ మటన్ బిర్యానీ అరగించారు. అలాగే ఆయనకు హలీమ్‌ను వడ్డించారు.
ఇవేగాకుండా నిజాం వంటకాలైన మరగ్, పాయా, కబాబ్, పన్నీర్ టిక్కా, దాల్, నాన్ రోటీలు, ఖుబానీ కా మీటా, బడల్ కా మీటా, మలాయ్ కుల్ఫీ, ఇటాలియన్ ఫుడ్ కూడా మెనూలో పొందుపరిచారు. ఈ డిన్నర్‌లో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఫలక్‌నుమా ఫ్యాలెస్ అందాలకు మెస్సీ ముచ్చటపడ్డారు. ప్యాలెస్‌లో 101 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసే నిజాం డైనింగ్ టేబుల్‌ను చూసి ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ ఆతిథ్యం మరిచిపోలేనిదని కితాబునిచ్చారు.


