సాక్షి, హైదరాబాద్: ఎగుమతుల విషయంలో తెలంగాణ గణనీయ వృద్ధిని సాధిస్తోంది. ఒక్క ఏడాదిలోనే 5 వేల మిలియన్ డాలర్లకుపైగా రాష్ట్ర ఎగుమతుల విలువలో పెరుగుదల నమోదయింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి ఎగుమతుల మొత్తం విలువ 14,026 మిలియన్ డాలర్లు కాగా.. 2024–25లో అది 19,123 మిలియన్ డాలర్లకు చేరిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలు వెల్లడించాయి.
ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసిన హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్–2024–25లో గత ఎనిమిదేళ్ల (2017–18 నుంచి) ఎగుమతుల గణాంకాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో ఎగుమతుల విలువలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు ఏడో స్థానం లభించింది.
ఐటీ, ఫార్మానే కీలకం
తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువగా ఫార్మా, ఐటీ రంగాల నుంచే ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ రెండు రంగాల నుంచి డ్రగ్ ఫార్ములేషన్లు, బల్క్ డ్రగ్స్, సాఫ్ట్‌వేర్ సంబంధిత ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
2024–25లో ఐటీ ఉత్పత్తుల ఎగుమతులున్న రాష్ట్రాల్లోనే ఎక్కువగా పెరుగుదల నమోదైందని.. తెలంగాణకు ఐటీకి తోడు ఫార్మా ఎగుమతులు భారీగా ఉండటం వల్లే అత్యధిక పెరుగుదల నమోదైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ సామగ్రి, రసాయనాలు, ఏరోస్పేస్ పరికరాలతోపాటు విత్తనాలు, బియ్యం, పత్తి లాంటి వ్యవసాయ రంగ ఉత్పత్తుల ఎగుమతులు కూడా తెలంగాణ నుంచి కొనసాగుతున్నట్లు ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. 
గుజరాత్ ఫస్ట్.. చండీగఢ్ లాస్ట్
దేశంలోనే అత్యధికంగా గుజరాత్ నుంచి ఎగుమతులు జరుగుతున్నట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. 2017–18లోనే దాదాపు 70 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసిన ఆ రాష్ట్రం.. 2024–25 నాటికి 1,16,332 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను ఇతర దేశాలకు పంపింది.
అయితే గత మూడేళ్లుగా గుజరాత్ ఎగుమతుల విలువల్లో తగ్గుదల నమోదవుతోంది. 2022–23లో 1.46 లక్షల మిలియన్ డాలర్లుగా ఉన్న గుజరాత్ ఎగుమతులు.. ఆ తర్వాతి ఏడాదిలో 1.34 లక్షలకు, దాని తర్వాతి ఏడాదిలో 1.16 లక్షల మిలియన్ డాలర్లకు తగ్గాయి.
ఇక కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో దేశంలోకెల్లా ఎగుమతుల విలువలు అతితక్కువగా ఉన్నాయి. 2024–25లో అక్కడి నుంచి జరిగిన ఎగుమతుల మొత్తం విలువ 14 మిలియన్ డాలర్లు మాత్రమే. మరోవైపు తెలంగాణ కంటే ఎక్కువ ఎగుమతుల విలువ నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ నిలిచాయి.


