సాక్షి, హైదరాబాద్: భారత విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వులు) మళ్లీ పెరిగాయి. డిసెంబర్ 5తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 1.033 బిలియన్ డాలర్లు పెరిగి 687.26 బిలియన్ డాలర్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. వరుసగా రెండు వారాల తగ్గుదల తర్వాత నిల్వలు పెరగడం గమనార్హం. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం భారీగా బంగారం నిల్వల వృద్ధి కావడమే.
ఆర్‌బీఐ వద్ద బంగారం నిల్వలు 1.19 బిలియన్ డాలర్లు పెరిగి 106.98 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే ఫారెక్స్‌లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 151 మిలియన్ డాలర్లు తగ్గి 556.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్ ఫారెక్స్ నిల్వలు గత సెప్టెంబర్‌లో నమోదైన 704.89 బిలియన్ డాలర్ల ఆల్‌టైం హైకి సమీపంలోనే ఉన్నాయని, ఇవి 11 నెలలకు పైగా దిగుమతులకు సరిపడే స్థాయిలో ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది.
ఫెడ్ నిర్ణయంతో లోహాలకు డిమాండ్
అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ 10న వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.5–3.75 శాతం పరిధికి తీసుకురావడంతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ డిసెంబర్ 12 నాటికి ఔన్స్‌కు 4,338 డాలర్లకు చేరి ఏడు వారాల గరిష్టాన్ని నమోదు చేసింది.
దేశీయంగా రికార్డు ధరలు
దేశీయ మార్కెట్లో డిసెంబర్ 13న 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.13,321గా ట్రేడైంది. ‘రూపాయి బలహీనత, పెట్టుబడి డిమాండ్ కొనసాగడం బంగారం ధరలకు బలమిచ్చాయి’అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
వెండికి ఊహించని ర్యాలీ
దేశంలో వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 13న దేశీయంగా వెండి ధర గ్రాముకు రూ.204.10, అంటే కిలోకు రూ.2,04,100 కు చేరింది. వారం కిందట ఇదే ధర రూ.1.87 లక్షలుగా ఉండటం గమనార్హం. సౌర విద్యుత్ ఎలక్ట్రిక్ వాహనాలు, ఎల్రక్టానిక్స్ రంగాల నుంచి పెరిగిన పారిశ్రామిక డిమాండ్, వరుసగా ఐదో ఏడాదీ కొనసాగుతున్న సరఫరా లోటు వెండి ధరలను పైకి నెడుతున్నాయి.
రూపాయి పతనం ప్రభావం
భారత రూపాయి డాలర్‌తో పోల్చితే 90 మార్క్‌ను దాటి రికార్డు పతనాన్ని నమోదు చేసింది. 2025లో ఇప్పటివరకు 5 శాతానికి పైగా పడిపోవడంతో ఆసియాలో అత్యంత బలహీన కరెన్సీగా మారింది. దీని ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు మరింత భారమయ్యాయి. అయితే ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య పెట్టుబడిదారులు సేఫ్ హావెన్ ఆస్తులుగా ఈ లోహాల వైపు మొగ్గు చూపుతున్నారు.


