కొత్త పంథాలో సాగుతున్న మాదకద్రవ్యాల దందా
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు హష్ ఆయిల్, గంజాయి
వాట్సాప్ స్టేటస్ ద్వారా తమ కస్టమర్లకు సమాచారం
దోశల మాదిరిగా ప్యాక్ చేసి బాయ్స్ ద్వారా డెలివరీ
గుట్టురట్టు చేసిన హెచ్–న్యూ టీమ్, ఐదుగురు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్‌గా నగరానికి వలసవచ్చి డ్రగ్ పెడ్లర్‌గా మారిన శ్రీకాకుళం వాసి వ్యవస్థీకృతంగా, కొత్త పంథాలో ఈ దందా చేస్తున్నాడు. వర్చువల్ నంబర్ వినియో గిస్తూ.. తన వద్దకు సరుకు వచ్చిన సమాచారాన్ని వాట్సాప్ స్టేటస్ ద్వారా కస్టమర్లకు చేరవేస్తున్నాడు. మాదకద్రవ్యాలను దోశల మాదిరిగా ప్యాక్ చేసి, డెలివరీ బాయ్స్ సహకారంతో ఆర్డర్ ఇచ్చిన వారి వద్దకు పంపిస్తున్నాడు.
ఈ వ్యవహారం గుట్టును రట్టు చేసిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు ఐదుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి ఐదేసి కేజీల చొప్పున గంజాయి, హష్ ఆయిల్, ద్విచక్ర వాహనం సహా రూ.70 లక్షల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నారు. శనివారం విలేకరుల సమావేశంలో డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఈ వివరాలు వెల్లడించారు.
సహచరుల కోసం దందా మొదలుపెట్టి..
ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన వైకుంఠ రావు 2017లో హైదరాబాద్‌కు వలసవచ్చి, మాదాపూర్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం ధూల్‌పేట నుంచి గంజాయిని కొనుక్కుని వెళ్లి తన సహచర డ్రైవర్లకు విక్రయించే వాడు. లాక్‌డౌన్‌లో ఉద్యోగం కోల్పోయి పూర్తిగా మాదకద్రవ్యాల దందా మొదలు పెట్టాడు.
తొలుత ధూల్‌పేట నుంచి గంజాయి తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఎక్కువ రేటుకు అమ్మేవాడు. 2020 నుంచి ఒడిశా విక్రేతల వద్ద నుంచి గంజాయి, హష్ ఆయిల్ తీసుకువచ్చి విక్రయించడం మొదలు పెట్టాడు. దీనికి సంబంధించి 2021లో సనత్‌నగర్, ఈ ఏడాది జూన్‌లో కొత్తవలస ఠాణాల్లో కేసులు నమోదై జైలుకు వెళ్లాడు.
ఆధారాలు చిక్కకుండా పథకం..
జైలు నుంచి బయటకు వచ్చిన వైకుంఠ రావు తన పంథా మార్చేశాడు. ఉనికి బయటపడకుండా దందా చేయడానికి నిర్ణయించుకుని ఒడిశాకు చెందిన హష్ ఆయిల్ తయారీదారుడు పాల్ ఖిలా, సప్లయర్ కృష్ణ జల్లాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు.
పాల్ నుంచి గంజాయి, హష్ ఆయిల్ సేకరించే కృష్ట నగరానికి తీసుకువచ్చి మాదాపూర్‌లోని వైకుంఠ రావు ఇంట్లో డెలివరీ ఇచ్చేవాడు. తన గుర్తింపు బయటపడకుండా వర్చువల్ నంబర్ వాడుతున్న వైకుంఠ రావు సరుకు వచ్చిన ప్రతిసారీ మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 వరకు ‘గ్రీన్ అవైలబుల్’అంటూ స్టేటస్ పెట్టేవాడు. దీన్ని చూసే ఇతడి రెగ్యులర్ కస్టమర్లు ఎంతెంత కావాలో వాట్సాప్‌లోనే ఆర్డర్ ఇచ్చేవారు.
దానికి అయ్యే మొత్తాన్ని ఆన్‌లైన్‌లో వసూలు చేసే వైకుంఠ రావు, సరుకు పంపడానికి తన బంధువులైన బాలాజీ, చైతన్యలను డెలివరీ బాయ్స్‌గా ఏర్పాటుకున్నాడు. గంజాయి, హష్ ఆయిల్ టిన్నులను దోశ మాదిరిగా పేపర్‌లో ప్యాక్ చేసి, వీరి ద్వారా సరుకు అయిపోయే వరకు 24 గంటలూ సరఫరా చేసేవాడు.
బాలాజీ చిక్కడంతో కదిలిన డొంక..
వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న హెచ్–న్యూ ఇన్‌స్పెక్టర్ జీఎస్ డానియేల్ నేతృత్వంలో టోలిచౌకి వద్ద కాపుకాశారు. అక్కడ ఓ కస్టమర్‌కు గంజాయి డెలివరీ చేయడానికి వచ్చిన బాలాజీని పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మాదాపూర్‌లోని వైకుంఠరావు గదిపై దాడి చేశారు. ఈ సందర్భంగా వైకుంఠ రావుతో పాటు అక్కడే ఉన్న పాల్, కృష్ణ, చైతన్యలను అదుపులోకి తీసుకున్నారు. ఆ గది నుంచి హష్ ఆయిల్, గంజాయిని సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును టోలిచౌకి పోలీసులకు అప్పగించారు.
వైకుంఠ రావు ఫోన్‌ను తనిఖీ చేసిన పోలీసులు 120 మంది వినియోగదారులను గుర్తించారు. వీరిలో ఐటీ, సినీ రంగానికి చెందిన వారితో పాటు డాక్టర్లు, ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు. వీరికి కుటుంబీకుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి రీహ్యాబ్‌కు పంపాలని నిర్ణయించామని, ఇలాంటి డ్రగ్స్ దందాలపై సమాచారం ఉంటే 8712661601 నంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని డీసీపీ వైభవ్ కోరారు.


