జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఫలితాల గురించి వివరించిన పీసీసీ చీఫ్
శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాహుల్‌తో పాటు ఫలక్‌నుమా ప్యాలెస్‌కు
ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్, మంత్రులు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పనితీరు పట్ల లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. మెస్సీ, రేవంత్‌రెడ్డిల మధ్య జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్‌గాంధీకి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి వివరించారని, ఈ సందర్భంగా ఆయన ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా గెలిచిన విషయాలను వివరించారని తెలిపాయి.
ఇందుకు రాహుల్ సానుకూలంగా స్పందించారని, మున్ముందు ఇదే పనితీరు కనబర్చాలని సూచించారని సమాచారం. కాగా, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్ వరకు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌లు ఒకే కారులో రాహుల్‌తో కలిసి వచ్చారు.
అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన రాహుల్‌గాందీకి సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథ్, సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎం.ఎ.ఫహీమ్ తదితరులు స్వాగతం పలికారు.
ఫీజు బకాయిలు చెల్లించాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఫీజు బకాయిల కోసం నవంబర్ 17 నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి నాయకుడు రాకేశ్ దత్తా చేస్తున్న పాదయాత్ర 250 కి.మీ.తో శనివారం హైదరాబాద్ చేరుకుంది.
ఈ సందర్భంగా రాకేశ్ దత్తా బృందాన్ని కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభినందించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... విద్యార్థులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వానికి చేతులు రావడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాకేశ్ దత్తా మాట్లాడుతూ ఫీజు బకాయిలు విడుదల చేయాలని 20 రోజులుగా పాదయాత్ర చేశానన్నారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కే విధంగా డ్రోన్లు వద్దని విద్యార్థులకు టాయిలెట్లు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పాదయాత్రలో ఖమ్మం నుంచి రాకేశ్ దత్తాతో పాటు విద్యార్థి నాయకులు గోనె శ్రీశ్రీ, ముదిగొండ పవన్, వాజెడ్ల అనిల్ తదితరులున్నారు.


