హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం సందడి
ఊగిపోయిన ఉప్పల్ స్టేడియం
సీఎం రేవంత్‌తో సరదా ఆట
విజయవంతంగా ఈవెంట్ నిర్వహణ
‘మెస్సీ కిక్ కొట్టిన బంతి నా వైపే దూసుకొచ్చింది. ఒక్కసారిగా ఎంతో భావోద్వేగానికి గురయ్యాను’... ఒక పదో తరగతి పిల్లాడి ఆనందం... ‘పదేళ్ల క్రితం మెస్సీ చాంపియన్స్ లీగ్ గెలిచినప్పటి నుంచి అతని ఆటంటే చాలా ఇష్టం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటంతో నా కల నెరవేరింది’... ఒంటిపై మెస్సీ టాటూ వేసుకున్న ఒక వీరాభిమాని సంతోషమిది.
మెస్సీ మైదానంలో గడిపింది గంట సమయం మాత్రమే కావచ్చు. కానీ ఫ్యాన్స్‌కు సంబంధించి అది అమూల్యమైన సమయం... అతని ప్రతీ కదలిక, వేసిన ప్రతీ అడుగు వారిలో అమిత ఉత్సాహాన్ని రేపింది. మెస్సీ కూడా ఉన్నంత సేపు చాలాసరదాగా, జాలీగా కనిపించడం ఈ మెగా ఈవెంట్ సక్సెస్‌కు సరైన సూచిక.
సాక్షి, హైదరాబాద్: నగర ఫుట్‌బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసిన లయోనల్ మెస్సీ షో విజయవంతంగా ముగిసింది. ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా రెండో నగరమైన హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్ ఎలాంటి ఇబ్బందులు, ప్రతిబంధకాలు లేకుండా సాఫీగా సాగింది. శనివారం ఉదయం కోల్‌కతాలో జరిగిన ఘటన నేపథ్యంలో హైదరాబాద్ కార్యక్రమంపై కాస్త సందేహాలు తలెత్తాయి.
అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో పటిష్ట ఏర్పాట్లు చేసి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. దాంతో అటు మెస్సీ బృందంతోపాటు ఇటు అభిమానులు కూడా సంతృప్తిగా మైదానాన్ని వీడారు.
రేవంత్‌కు పాస్‌లు...
మెస్సీ టూర్ ఖరారైన రోజు నుంచి ప్రభుత్వం హడావిడి చేసిన మెస్సీ వర్సెస్ రేవంత్ మ్యాచ్ మాత్రం జరగలేదు కానీ... మెస్సీ, సీఎం మధ్య కొన్ని సరదా కిక్‌లు, పాస్‌లు మాత్రం నడిచాయి. మెస్సీ ఇచ్చిన పాస్‌లు చక్కగా అందుకున్న రేవంత్ రెడ్డి వాటిని మళ్లీ రిటర్న్ కూడా చేశారు. స్వారెజ్, రోడ్రిగో కూడా దీనికి జత కలిశారు.
ఈ నలుగురు కలిసి ఆడుతున్న సమయంలో స్టేడియంలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విజిల్స్, కేకలతో సందడి చేశారు. చివరకు మెస్సీ కొట్టిన ఒక కిక్ రేవంత్‌ను దాటి గోల్ పోస్ట్‌లోకి వెళ్లడంతో ఈ ఆట ముగిసింది. దీనికి ముందు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సింగరేణి ఆర్‌ఆర్ టీమ్, అపర్ణ మెస్సీ ఆల్‌స్టార్స్ టీమ్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఇందులో సింగరేణి టీమ్ విజేతగా నిలిచింది.
చిన్నారులతో సందడి...
ముందుగా ఎంపిక చేసిన వర్ధమాన ఫుట్‌బాలర్లు, చిన్నారులతో కూడా మెస్సీ కొద్దిసేపు ఆడాడు. వీటి కోసం నాలుగు వేర్వేరు జోన్‌లను ఏర్పాటు చేయగా, ప్రతీ చోటికి వెళ్లి ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ కొంత సమయం కేటాయించాడు. మెస్సీతో కలిసి ఆడిన వారిలో అంతుపట్టలేని ఆనందం కనిపించింది. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి మనవడు కూడా సందడి చేశాడు. అతని వైపు కూడా మెస్సీ రెండు పాస్‌లు ఇవ్వడం విశేషం.
స్టాండ్స్‌లోకి బంతులు...
స్టేడియంలో అభిమానులను బాగా అలరించి వారంతా పూర్తిగా ఎంజాయ్ చేసింది మాత్రం మెస్సీ స్పెషల్ కిక్‌లతోనే. ఆ సమయంలో మాత్రం స్టేడియంలో పూర్తి స్థాయిలో హోరెత్తిపోయింది. అతను ప్రత్యేకంగా పెనాల్టీలు ఆడకపోయినా... నిర్వాహకులు ఇచ్చిన బంతులను తనదైన శైలిలో కిక్‌లతో స్టాండ్స్‌లోకి పంపించాడు. బంతిని అందుకొని అర్జెంటీనా స్టార్ కిక్‌కు సిద్ధమైన ప్రతీ సారి ఉప్పల్ ఊగిపోయింది. ఆ బంతులను అందుకోవడంలో స్టాండ్స్‌లో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. కానీ కొందరు అదృష్టవంతులకే ఆ అవకాశం దక్కింది!
ఉల్లాసంగా...ఉత్సాహంగా...
మెస్సీ మొత్తం ‘షో’లో అతను మైదానంలో గడిపిన తీరే చెప్పుకోదగ్గ విశేషం. అక్కడ ఉన్నంతసేపు అతను చాలా ఉత్సాహంగా, నవ్వుతూ గడిపాడు. ముందుగా ప్రేక్షకుల హర్షధ్వానాలతో మైదానంలోకి రావడం మొదలు చివరి వరకు అతను దీనిని కొనసాగించాడు. ఉదయం కోల్‌కతాలో రసాభాసగా మారిన ఈవెంట్‌లో పూర్తి అసౌకర్యంగా కనిపించిన అతను హైదరాబాద్‌లో మాత్రం అలాంటి ఛాయలు కూడా కనపడనివ్వలేదు.
ఇరు జట్ల ఆటగాళ్లతో కరచాలనం, రేవంత్‌తో ఆడిన కొద్దిసేపు, ఆపై చిన్నారులతో ఆట, స్టాండ్స్‌లోకి కిక్ కొడుతూ ఉత్సాహం నింపడం, చివర్లో గ్రూప్ ఫోటోలు... ఇలా ఎక్కడైనా అతనిలో చిరునవ్వు చెక్కుచెదర్లేదు. ఎక్కడా ఎలాంటి అసహనాన్ని ప్రదర్శించలేదు. ఆఖర్లో ‘హైదరాబాద్‌కు రావడం సంతోషంగా ఉంది.
మీరు ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు’ అంటూ కృతజ్ఞతలు చెప్పడం వరకు చూస్తే అతను కూడా హైదరాబాద్ టూర్‌ను బాగానే ఎంజాయ్ చేసినట్లు కనిపించాడు. ఆఖర్లో మెస్సీకి ముఖ్యమంత్రి జ్ఞాపిక అందించగా, స్వారెజ్‌కు రాహుల్ గాంధీ జ్ఞాపిక ఇచ్చారు. వీరిద్దరికీ మెస్సీ తన ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీలను అందించాడు.


