కటక్: టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ ఉన్నతి హుడా మరో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. ఒడిశా మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో ఉన్నతి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
హరియాణాకు చెందిన 18 ఏళ్ల ఉన్నతి సెమీఫైనల్లో 18–21, 21–16, 21–16తో ప్రపంచ మాజీ జూనియర్ నంబర్‌వన్, భారత్‌కే చెందిన తస్నిమ్ మీర్‌పై విజయం సాధించింది. ఫైనల్లో భారత్‌కే చెందిన ఇషారాణి బారువాతో ఉన్నతి తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో అస్సాం ప్లేయర్ ఇషారాణి 18–21, 21–7, 21–7తో భారత్‌కే చెందిన తాన్యా హేమంత్‌ను ఓడించింది.
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ కిరణ్ జార్జి ఫైనల్లోకి అడుగు పెట్టాడు. సెమీఫైనల్లో కిరణ్ జార్జి 21–19, 8–21, 21–18తో సహచరుడు రౌనక్ చౌహాన్‌పై విజయం సాధించాడు. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో అశ్విని భట్–శిఖా గౌతమ్ (భారత్) జోడీ 13–21, 16–21తో ఓంగ్ జిన్ యీ–కార్మెన్ టింగ్ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్లో కణపురం సాత్విక్ రెడ్డి–రేషిక (భారత్) ద్వయం 16–21, 19–21తో దెజాన్–బెర్నాదినె వర్దన (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.


