
నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులకు వృత్తి శిక్షణను అందించే లాభాపేక్షలేని సంస్థ అయిన ‘ఉన్నతి ఫౌండేషన్’ కాకినాడలో కొత్త శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. కెప్టెన్ సుబ్బారావు ఉదార మద్దతుతో ప్రారంభమైన ఈ కేంద్రం, కీలకమైన ఉపాధి నైపుణ్యాలను , ఉద్యోగ అవకాశాలను పొందేందుకు యువతకు వీలు కల్పిస్తోంది.
2024లో కాకినాడలో తన శిక్షణా కార్యక్రమాలను ఉన్నతి ప్రారంభించింది. ఇప్పటి వరకు దాదాపు 70 మందికి పైగా యువతకు విజయవంతంగా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడంలో సహాయసహకారాలు అందించింది. అంతేకాకుండా, ఈ సంస్థ కళాశాలల్లో UNXT శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కాకినాడలో దాదాపు 1,700 మంది విద్యార్థులకు చేరువవుతోంది.
కొత్తగా ఏర్పాటుచేసిన ఈ వృత్తి శిక్షణా కేంద్రం, UNXT మోడల్‌తో కలిసి.. ప్రతి ఏడాది కాకినాడలో 2 వేల మందికి పైగా యువతకు నైపుణ్యం, వృత్తి శిక్షణ, ఉపాధి అవకాశాలను ఈ ఉన్నతి సంస్థ అందించనుంది . వృత్తి శిక్షణ కేంద్రంలో, శిక్షణ పొందిన ప్రతి వ్యక్తికి 35వ రోజు శిక్షణ నాటికి ఉద్యోగం లభిస్తుందనే భరోసా అందిస్తోంది. ఇది దీర్ఘకాలిక, స్థిరమైన కెరీర్‌లకు పునాది వేస్తుంది.
“ఈ కేంద్రం ప్రారంభించడం ద్వారా, కాకినాడలో వీలైనంత ఎక్కువ మంది యువతను ఉద్యోగ రంగంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేయడమే మా లక్ష్యం. ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయడంలో ఉదార మద్దతు ఇచ్చినందుకు కెప్టెన్ సుబ్బారావు ప్రభలకు తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆయన నమ్మకం నిజంగా ప్రశంసనీయం, ఆయనతో భాగస్వామ్యం చేసుకోవడాన్ని గౌరవంగా ఉన్నతి భావిస్తోంది ” అని ఉన్నతి ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ స్వామి అన్నారు.
ఈ కార్యక్రమంపై తన ఆలోచనలను కెప్టెన్ ప్రభల వెల్లడిస్తూ , “ఆంధ్రప్రదేశ్‌కు అపారమైన సామర్థ్యం ఉంది, కానీ అర్థవంతమైన ఉపాధిని పొందడానికి విద్య ఒక్కటి మాత్రమే ఎల్లప్పుడూ సరిపోదు. ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఉన్నతికి మద్దతు ఇచ్చి, తమ స్వంత కాళ్ళపై నిలబడేలా చేయడమే గాక, గౌరవప్రదంగా బతికేలా చేసేందుకు తమవంతు సహాయసహకారాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చాలామంది బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, భీమా(BFSI)లో బిజినెస్ అసోసియేట్ వంటి ప్రొఫెషనల్ ఉద్యోగాలు పొందారు.
మరికొందరు బీపీవో, టెలికాలింగ్ కార్యకలాపాల్లో చేరారు. అలాగే ప్రభుత్వ కళాశాలలలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థతో కలిసి ఉన్నతి ఫౌండేషన్ పనిచేస్తుంది. ఒక్క కాకినాడలోనే, 5 నుంచి 6 కళాశాలలతో ఉన్నతి భాగస్వామ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 29 వేలు కంటే ఎక్కువ మంది యువత దీని నుంచి పలు రకాల ప్రయోజనాలు పొందారు.