
కావోసియుంగ్ సిటీ (చైనీస్ తైపీ): కావోసియుంగ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి మారెడ్డి మేఘన రెడ్డి పోరాటం ముగిసింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించిన మేఘన... బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో 21–19, 17–21, 14–21తో టాన్‌రుగ్ సెహెంగ్ (థాయ్‌లాండ్) చేతిలో పోరాడి ఓడిపోయింది.
64 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో మేఘన తొలి గేమ్‌ను దక్కించుకుంది. అయితే అదే జోరును తదనంతరం కొనసాగించలేకపోయింది. రెండో గేమ్‌లో ఒకదశలో 11–12తో ఒక్క పాయింట్ వెనుకంజలో నిలిచిన మేఘన... ఆ తర్వాత తడబడి చివరకు నాలుగు పాయింట్ల తేడాతో గేమ్‌ను కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో టాన్‌రుగ్ ఆరంభంలోనే 4–0తో ఆధిక్యంలోకి వెళ్లగా... మేఘన ఒక్కసారి కూడా స్కోరును సమం చేయలేకపోయింది.
ఇదే టోర్నీలో బరిలోకి దిగిన భారత ఇతర క్రీడాకారిణులు దేవిక సిహాగ్ 26–28, 21–17, 21–13తో లీ జిన్ యి మేగన్ (సింగపూర్)పై, ఇషారాణి బారువా 21–13, 21–10తో నూత్నలిన్ రత్తానపాన్‌వోంగ్ (థాయ్‌లాండ్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... మాన్సి సింగ్, అషి్మత చాలిహా తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు.