రేపు ప్రొ రెజ్లింగ్ లీగ్ వేలం
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు అమన్ సెహ్రావత్, అంతిమ్ పంఘల్... ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అమన్ పురుషుల విభాగంలో రూ. 18 లక్షల ప్రాథమిక ధరతో వేలంలోకి రానుండగా... మహిళల విభాగంలో అంతిమ్ రూ. 10 లక్షలు ‘బేస్ ప్రైస్’గా నిర్ణయించుకుంది. ఈ నెల 15 నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుండగా... శనివారం వేలం నిర్వహించనున్నారు.
ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు హరియాణ థండర్స్, టైగర్స్ ఆఫ్ ముంబై దంగల్స్, పంజాబ్ రాయల్స్, మహారాష్ట్ర కేసరి, ఢిల్లీ దంగల్ వారియర్స్, యూపీ డామినేటర్స్ పాల్గొంటున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, 21 ఏళ్ల అమన్ సెహ్రావత్ అత్యధిక ప్రాథమిక ధరతో వేలంలో అందుబాటులో ఉండగా... కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత దీపక్ పూనియా, నవీన్ రూ. 10 లక్షల ‘బేస్ ప్రైస్’తో వేలంలోకి రానున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న సుజీత్ కల్‌కల్ తన ప్రాథమిక ధరను రూ. 7 లక్షలుగా నిర్ణయించుకున్నాడు. విదేశీ రెజ్లర్ల కేటగిరీల్లో రష్యాకు చెందిన ప్రపంచ మాజీ చాంపియన్ మగోమ్‌డోవ్‌తో పాటు అర్మాన్ (అర్మెనియా), ఇస్మాయిల్ (హంగేరీ), అర్సెన్ (అర్మేనియా), ఉస్మానోవ్ అహ్మద్ (రష్యా) రూ. 10 లక్షల ప్రాథమిక ధరతో వేలంలోకి రానున్నారు. మహిళల విభాగంలో భారత స్టార్ అంతిమ్ పంఘల్ రూ. 10 లక్షల ‘బేస్ ప్రైస్’తో వేలంలోకి రానుంది.


