భారత చాంపియన్ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ గురువారం మొదలయ్యే ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) సవాళ్లకు సిద్ధమని ప్రకటించింది. కొరకరాని విదేశీ రెజ్లర్లపై ఎప్పటి నుంచో దృష్టి సారించినట్లు చెప్పింది. మన రెజ్లర్లకు జాతీయ శిబిరాలు మెలకువలు నేర్పిస్తే... విదేశాల్లో శిక్షణ విదేశీ రెజ్లర్లను దీటుగా ఎదుర్కొనే స్థయిర్యాన్నిస్తుందని చెప్పుకొచ్చింది.
న్యూఢిల్లీ: రోజుల వ్యవధిలోనే మొదలయ్యే పీడబ్ల్యూఎల్ కోసం పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యానని భారత స్టార్ మహిళా రెజ్లర్ అంతిమ్ పంఘాల్ తెలిపింది. 53 కేజీల కేటగిరీలో జూనియర్, సీనియర్ అంతర్జాతీయ స్థాయిల్లో ఇదివరకే నిరూపించుకున్న అంతిమ్ ఇప్పుడు కొత్త తరహా లీగ్ ‘పట్టు’కు సై అంటోంది. 17 ఏళ్ల వయసులోనే 2022లో అండర్–20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆమె ఆ మరుసటి ఏడాది టైటిల్ నిలబెట్టుకుంది. ప్రపంచ ఛాంపియన్షిప్ లో రెండు కాంస్యాలు నెగ్గిన ఆమె.. 2022 ఆసియా క్రీడల్లోనూ కాంస్య పతకంతో మెరిసింది. 21 ఏళ్ల ఈ స్టార్ రెజ్లర్ తనకు ఎదురయ్యే మింగుడు పడని విదేశీ రెజ్లర్లపై ఓ కన్నేసినట్లు చెప్పింది.
జపాన్ దిగ్గజ రెజ్లర్ యుయ్ సుసాకి పోటీల వీడియోలను ఫోన్‌లో తరచూ చూస్తానని చెప్పుకొచ్చింది. తన కెరీర్‌లోనే ఓటమి ఎరుగని సుసాకిపై పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇలా మేటి రెజ్లర్లను ఓడించే సత్తా మనకుందని 2023లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున అవార్డు’ అందుకున్న అంతిమ్ చెప్పుకొచ్చింది. బౌట్‌కు ముందు ఎన్నో ఆలోచనలు చుట్టూ తిరుగుతూనే ఉంటాయని, అయితే బౌట్ కోసం మ్యాట్ మీదిగి దిగగానే మైండ్ ఒక్కసారిగా ‘పోరాటం’పైనే పడుతుందని, దీంతో... గెలుపోటముల ఆలోచనేది గుర్తుకురాదని, వంద శాతం కుస్తీపట్టడం గురించే ఆలోచిస్తానని అంతిమ్ వివరించింది. ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) ఈ నెల 15 నుంచి నోయిడా ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన మనోభావాలను ఇలా పంచుకుంది.

అర కోటి... అస్సలు ఊహించలేదు!
‘పీడబ్ల్యూఎల్ వేలంలో ఈ స్థాయి మొత్తం లభిస్తుందని అస్సలు ఊహించనేలేదు. నేనే కాదు... మా కుటుంబసభ్యులెవరూ ఇంత మొత్తం వస్తుందని అనుకోలేదు. నిజానికి నాకు సుమారు రూ. 30 లక్షలకు అటు ఇటుగా వస్తుందనే ఆశించాను. పెరిగినా దీనికి కాస్తే ఎక్కువ రావొచ్చని అనుకున్నా! కానీ ఏకంగా రూ. 50 లక్షలు దక్కుతాయని ఏమాత్రం ఊహించలేదు. వేలం జరుగుతుండగా నేను ఆలయానికి వెళ్లాను. యూపీ డామినేటర్స్ నన్ను అంత మొత్తానికి కొనుగోలు చేసిందని తెలియగానే దేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాను. హరియాణాకు చెందిన నేను కెరీర్ అసాంతం ఈ రాష్ట్రానికే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఎందుకనో ఈ లీగ్‌లో మాత్రం యూపీ తరఫునే ఆడాలని గట్టిగా అనుకున్నా’.
మరింత పట్టుదలతో...
‘సీనియర్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మరింత పట్టుదలతో, రెట్టించిన ఉత్సాహంతో పునరాగమనం చేస్తుంది. ఆమె రిటైర్మెంట్‌ను పక్కనబెట్టడం శుభపరిణామం. నాకంటే ఆమె ఎంతో అనుభవజ్ఞురాలైన రెజ్లర్. ఆమె వస్తుందంటేనే చెమటోడ్చేందుకు సిద్ధమైందని అర్థం. ఏ ప్లేయర్ అయినా సరే పోరాడేతత్వం, మనోధైర్యం బలంగా ఉంటేనే పునరాగమనం చేస్తారు. మన వినేశ్ కూడా అంతే! ఇక నేను పోటీపడే 53 కేజీల కేటగిరీ నాకు మాత్రమే సొంతం కాదు. ఎవరైనా పోటీపడొచ్చు. ఏ కేటగిరీ సరైందో పోటీ పడే అథ్లెట్‌కే బాగా తెలుస్తుంది. అందులో ఎంతగా కష్టపడగలదో, ఏ రకంగా గెలుస్తుందో, దేనివల్ల ఓడిపోతోందో ఆ విభాగానికి చెందిన అథ్లెట్‌కే బాగా తెలుస్తుంది’.
సీనియర్ స్థాయికి ఎదగగానే...
‘జూనియర్ నుంచి సీనియర్ స్థాయి పోటీల్లో బరిలోకి దిగుతుంటే మన పరిణతి కూడా పెరుగుతుంది. జూనియర్స్‌లో ఒకట్రెండు పాయింట్లు ఓడితే నిరాశ ఆవహించేది. కానీ ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నా. ఒకట్రెండు పాయింట్లు కాదు... ఆడాల్సింది ఆరు నిమిషాలు. ఒకటి అర కోల్పోయినా ప్రత్యర్థి పట్టుపట్టేందుకు, పైచేయి సాధించేందుకు మన చేతిలో సమయమైతే ఉంటుంది. ఇప్పుడు నా ట్రెయినింగ్ కూడా మారింది. అంతేకాదు... మళ్లీ నేను కోచ్ సియరామ్ దహియాతో శిక్షణ తీసుకోవడం నన్ను మరింత మెరుగుపరిచింది. దహియా మార్గదర్శకంలో అనవసర ఒత్తిడి తగ్గించుకొని త్వరితగతిన పుంజుకోవడంపై ఎక్కువగా దృష్టి సారించాను. అదేపనిగా లేదంటే మితిమీరిన శిక్షణ కూడా తగదని కోచ్‌లు వారిస్తారు. మ్యాట్‌పై ఎప్పుడు కుస్తీ పట్టాలో... వద్దో మేము, కోచ్, ఫిజియో కలిసి నిర్ణయించుకుంటాం. అనుకూల వాతావరణాన్ని సృష్టించుకుంటాం’.
విదేశీ శిక్షణ కీలకం
‘జాతీయ శిబిరాలు రెజ్లర్లను దీటుగా సన్నద్ధపరుస్తున్నాయి. అలాగని విదేశాల్లో శిక్షణ అనవసరం అనుకుంటే పొరపాటు. అది కూడా రెజ్లర్లకు కీలకమైన వేదిక. మేమంతా కూడా సహచరులతో కుస్తీ పట్టడం ద్వారానే నేర్చుకున్నాం. అంటే మా మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో, ఎవరి సత్తా ఎంటో మాకు బాగా తెలుసు. జాతీయ శిబిరాల్లో ఇదే జరుగుతుంది. కానీ విదేశీ రెజ్లర్లు మాలానే ఉంటారని అనుకోలేం. వారిలో వేగం ఎక్కువ. అలాంటి వారితో అడపాదడపా విదేశాల్లో శిక్షణ ఏర్పాటు చేస్తే ఈ అనుభవం అంతర్జాతీయ పోటీలకు బాగా ఉపయోగపడుతుంది’.


