సాక్షి, న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. టెరిటోరియల్ ఆర్మీలో అతనికి ‘లెఫ్టినెంట్ కల్నల్’ గౌరవ హోదాను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ప్రదానం చేశారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో బుధవారం దీనికి సంబంధించిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, టెరిటోరియల్ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వేడుకలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్వయంగా నీరజ్ చోప్రా భుజాలపై లెఫ్టినెంట్ కల్నల్ హోదా బ్యాడ్జ్‌లను అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరజ్ పట్టుదల, దేశభక్తి, నిరంతర శ్రమకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.
హరియాణాకు చెందిన నీరజ్ 2016లో భారత సైన్యంలోని ‘ది రాజ్‌పుతానా రైఫిల్స్’లో సుబేదార్‌గా∙కెరీర్‌ను మొదలుపెట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో అతని ఘనతలకు గుర్తింపుగా 2021లో సుబేదార్ నుంచి మేజర్‌గా పదోన్నతి కలి్పంచారు. ఆ మరుసటి ఏడాది ‘పరమ విశిష్ట సేవా పతకం’తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతనికి టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ కమిషన్‌ను మంజూరు చేశారు. తాజాగా కల్నల్ గౌరవ హోదా కట్టబెట్టారు.


