పేలవ ఫామ్ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన టీమిండియా అవకాశాన్ని చేజార్చుకున్న కరుణ్ నాయర్.. తాజాగా అదే ఫామ్ లేమి కారణంగా దేశవాలీ అవకాశాన్ని కూడా కోల్పోయాడు. ఇటీవలే విదర్భ నుంచి తన సొంత జట్టు కర్ణాటక పంచన చేరిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో దారుణంగా విఫలమై జట్టులో స్థానం కోల్పోయాడు.
ఈ టోర్నీలో తొలి 6 మ్యాచ్‌ల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేసిన కరుణ్.. త్రిపురతో ఇవాళ (డిసెంబర్ 8) జరిగిన మ్యాచ్ నుంచి తప్పించబడ్డాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ వరకు మంచి ఫామ్‌లో ఉండిన కరుణ్ పొట్టి ఫార్మాట్‌కు వచ్చే సరికి చాలా ఇబ్బంది పడ్డాడు. కరుణ్ గత ఎడిషన్ SMAT ఫామ్ ఇందుకు భిన్నంగా ఉండింది. గత ఎడిషన్‌లో విదర్భకు ఆడిన కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు.
కరుణ్‌ను ఐపీఎల్ 2026 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి నెల కూడా కాకముందే కరుణ్ ఇంత చెత్త ప్రదర్శనలు చేయడం ఢిల్లీ యాజమాన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.
కరుణ్ గత ఐపీఎల్ సీజన్ మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై అదరగొట్టి (40 బంతుల్లో 89 పరుగులు), ఆతర్వాత ఆ స్థాయి ప్రదర్శన కొనసాగించలేక ఇబ్బంది పడ్డాడు. అయినా కరుణ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నమ్మకముంచి రీటైన్ చేసుకోవడం ఆశ్చర్యకరం.
ఇదిలా ఉంటే, కరుణ్ లేని మ్యాచ్‌లో కర్ణాటకపై త్రిపుర సంచలన విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో ఆ జట్టు కర్ణాటకకు షాకిచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు తలో 197 పరుగులు చేయగా.. సూపర్ ఓవర్‌లో త్రిపుర ఊహించని విధంగా వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేయగా.. కర్ణాటక వికెట్ కోల్పోయి 18 పరుగులకే పరిమితమైంది. దీంతో త్రిపుర సంచలన విజయం నమోదు చేసింది.


